- గజ్వేల్‌లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఎదుట మృతురాలి బంధువుల నిరసన
గజ్వేల్, వెలుగు: తమ బిడ్డ వైద్యం వికటించడం వల్ల చనిపోయిందని ఆరోపిస్తూ ఓ ప్రైవేట్హాస్పిటల్ఎదుట మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నాకు దిగారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కుకునూర్‌పల్లి మండలంలోని మంగోల్ గ్రామానికి చెందిన మెడబోయిన కల్యాణి(19) గజ్వేల్‌లోని ఓ ప్రైవేట్హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది. గురువారం ఆమె తీవ్ర అస్వస్తతకు గురవడంతో ఆమె పనిచేస్తున్న హాస్పిటల్లోనే వైద్యం అందించారు.
పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ రాత్రి చనిపోయింది. శుక్రవారం ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులతో కలసి గజ్వేల్‌లో ఆమెకు మొదట వైద్యం చేసిన ప్రైవేట్హాస్పిటల్వద్దకు వచ్చి వైద్యం వికటించిన కారణంగానే తమ బిడ్డ ప్రాణం పోయిందని ఆరోపిస్తూ హాస్పిటల్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యులు, హాస్పిటల్యాజమాన్యంతో మాట్లాడి వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి వెళ్లారు.