మంచిర్యాల జిల్లాలో పెద్దపులి కలకలం

  • హాజీపూర్​లో రెండు గొర్రెల హతం.. భయాందోళనలో ప్రజలు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో పెద్దపులి కలకలం రేపుతోంది. సోమవారం రాత్రి మండలంలోని బుగ్గగట్టు సమీపంలోని మామిడి తోటల్లో గొర్రెల మందపై దాడి చేసింది. ఓ గొర్రెను చంపి కొంత భాగం అక్కడే తినేసింది. మరో గొర్రె పిల్లను నోట కరుచుకుని సమీపంలోని అడవిలోకి వెళ్లింది. అది చూసి భయాందోళనకు గురైన గొర్రెల కాపరులు దుప్పట్లు కప్పుకొని ఓ పక్కన దాక్కొని ప్రాణాలు కాపాడుకున్నారు. గత మూడ్రోజులుగా పెద్దపులి ఆ ప్రాంతంలో తిరుగుతోందని చుట్టుపక్కల రైతులు పేర్కొంటున్నారు. 

సోమవారం రాత్రి గొర్రెల మందపై దాడి చేసిన తర్వాత చాలాసేపు అక్కడ గాండ్రించినట్లు తెలిపారు. ఈ విషయమై ఫారెస్ట్ అధికారులు స్పందిస్తూ అది పులి కాదని, చిరుత అయ్యి ఉండొచ్చని అంటున్నారు. అయితే రెండ్రోజుల క్రితం ఇదే ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్టు గ్రామాల్లో డప్పు చాటింపు చేసిన అధికారులు.. ఇప్పుడు అది చిరుత అనడంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. అసలే వరి కోతల టైమ్ కావడంతో పొలాలకు వెళ్లడానికి భయపడిపోతున్నారు. 

అది పెద్దపులే.. 

‘సోమవారం రాత్రి మేము బుగ్గగుట్ట దగ్గరున్న మామిడి తోటలో గొర్రెల మంద పెట్టినం. పెద్దపులి మందపై దాడి చేసి ఒక గొర్రెను చంపి కొంత భాగం తిన్నది. అనంతరం మరో గొర్రె పిల్లను నోట కరుచుకుని అడవిలోకి పోయింది. నేను దుప్పట్లు కప్పుకొని దాక్కోవడంతో ప్రాణాలతో బయటపడ్డ. చనిపోయిన గొర్రెల విలువ రూ.20వేల వరకు ఉంటుంది’ అని గొర్రెల కాపరి మెరుగు శ్రీనివాస్ తెలిపాడు.