- రూ. 2.25 కోట్ల విలువైన గంజాయి, వాహనం స్వాధీనం
ఆదిలాబాద్, వెలుగు : ఏపీ, ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న గంజాయిని, ముఠా సభ్యులను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్దమొత్తంలో గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం అందడంతో తలమడుగు మండలంలోని మహారాష్ట్ర బార్డర్ వద్ద గల లక్ష్మీపూర్ చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ చెందిన ఓ వెహికల్ అనుమానాస్పదంగా కనిపించడంతో ఆపి తనిఖీ చేయగా గంజాయి విషయం బయటపడింది. కేసుకు సంబంధించిన వివరాలను తలమడుగు పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ గౌస్ ఆలం వెల్లడించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన గంజాయి వ్యాపారులు పండిత్, ఒడిశాకు ఆశీశ్ ఐశ్చర్ వెహికల్ డ్రైవర్ వసీంకు పది రోజుల కింద కొంత డబ్బు ఇచ్చి ఏపీ, ఒడిశా బార్డర్ నుంచి మహారాష్ట్రలోని బుల్దానా, మాలే జిల్లాలకు గంజాయి చేరవేయాలని చెప్పారు. దీంతో వసీం, క్లీనర్ అర్మాన్‌తో కలిసి ఒడిశా బార్డర్ వద్దకు వెళ్లి గంజాయిని లోడ్ చేసుకున్నారు. తర్వాత ఐశ్చర్ ముందు ఓ పైలెట్‌వాహనం వెళ్తుండగా వసీం గంజాయి వెహికల్‌తో వరంగల్, కరీంనగర్ మీదుగా మహారాష్ట్రలోని బుల్దానాకు వెళ్తున్నాడు.
ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా లక్ష్మీపూర్ చెక్‌పోస్ట్ వద్దకు చేరుకోగానే పోలీసులు వెహికల్‌ను పట్టుకున్నారు. పైలెట్ వాహనంలో ఉన్న వ్యక్తి పరార్ కాగా ఐశ్చర్ డ్రైవర్ వసీం, క్లీనర్ అర్మాన్‌తో పాటు ఆశీష్, పండిత్, ఉత్తరాఖండ్‌కు చెందిన అన్షుజైన్, సోను అన్సారీలతో పాటు మరో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. వీరి నుంచి రూ. 2.25 కోట్ల విలువైన 900 కిలోల గంజాయి, ఐశ్చర్, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
గంజాయిని పట్టుకున్న ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ సురేందర్‌రెడ్డి, ఆదిలాబాద్ రూరల్ సీఐ కె.ఫణిధర్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్, జైనథ్ సీఐ డి.సాయినాథ్, ఆదిలాబాద్ రూరల్ ఎస్సైలు అంజమ్మ, ముజాహిద్, విష్ణువర్ధన్‌ను అభినందించి, రివార్డు అందజేశారు.