మెదక్ ​జిల్లాలో ఘనంగా జెండా పండుగ

  •     ఉమ్మడి మెదక్ ​జిల్లా వ్యాప్తంగా 78వ స్వాతంత్ర్య దిన వేడుకలు
  •     జెండా ఎగరవేసిన ప్రభుత్వ సలహాదారు కేశవ రావు
  •     మంత్రులు పొన్నం  ప్రభాకర్, దామోదర రాజనర్సింహ 

మెదక్, టౌన్, సిద్దిపేట, సంగారెడ్డి టౌన్, వెలుగు : ఉమ్మడి మెదక్ ​జిల్లా వ్యాప్తంగా గురువారం 78వ స్వాతంత్ర వేడుకలు వైభవంగా నిర్వహించారు. మెదక్​పట్టణంలోని పోలీస్​పరేడ్​గ్రౌండ్​లో ప్రభుత్వ సలహాదారు కేశవరావు జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. సీఎం రేవంత్​రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందన్నారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద జిల్లాలో 1,672 మంది పేదలు చికిత్స పొందారన్నారు. ఇందిరమ్మ పథకం కింద ప్రతీ నియోజకవర్గంలో 3,500 గృహాలు నిర్మిస్తున్నామని, రూ.500 లకే గ్యాస్‌ స్కీమ్​కింద 2 లక్షల10 వేల162 గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేశామన్నారు.

గృహజ్యోతి కింద1 లక్షా 21 వేల 207 మంది వినియోగదారులకు జీరో బిల్లును జారీ చేశామని, రుణమాఫీ కింద 74 వేల 342 మందికి రూ.473.76 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. మెదక్ ఖిల్లాపై, ఎమ్మెల్యే క్యాంప్​ఆఫీస్​లో ఎమ్మెల్యే రోహిత్​రావు జెండాను ఆవిష్కరించారు. విద్యుత్​శాఖలో ఉత్తమ సేవలందించినందుకు ఎస్​ఈ జానకీరాములు, లైన్​మన్ ప్రశాంత్​కు అవార్డు, ప్రశంసాపత్రాలను అందించారు.  కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

సిద్దిపేటలో..

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో జరిగిన స్వాతంత్య్ర్య వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం గౌరవ పోలీస్ వందనం స్వీకరించి స్వాతంత్ర సమరయోధులను సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. రుతుప్రేమ, సెట్విన్, వైద్య ఆరోగ్యశాఖ, ఉద్యానవన పట్టు పరిశ్రమశాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మెప్మా, చేనేత, జౌలి శాఖ, ఎస్సీ అభివృద్ధిశాఖ, స్త్రీ, శిశు, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమశాఖ, లీడ్ బ్యాంకు, పోలీస్ కమిషనరేట్ వారు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు.

అగ్ని మాపక శాఖ వారు అగ్ని ప్రమాదాలకు ఎలా స్పందించాలో లైవ్ లో చూపించారు. ఆర్టీసీ, విద్యాశాఖ, పౌరసరఫరాల శాఖ, విద్యుత్ శాఖ, పంచాయతీ రాజ్, వ్యవసాయ, అటవీ, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖల శకటాల ప్రదర్శనను, జడ్పీ హెచ్​ఎస్​స్కూల్ ఇందిరానగర్, జడ్పీహెచ్ఎస్ నారాయణరావుపేట, జడ్పీహెచ్ఎస్ కొండపాక, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఎన్సాన్పల్లి  విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించారు. చివరగా విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన 239 ఉద్యోగులకు ప్రశంసా పత్రంతో సన్మానించారు. ఈ స్వాతంత్ర్య వేడుకల్లో కలెక్టరు మనుచౌదరి, సీపీ అనురాధ, అడిషనల్​కలెక్టర్లు గరిమ అగర్వాల్​, శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికారులు, సిబ్బంది, స్టూడెంట్స్​, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

సంగారెడ్డిలో..

సంగారెడ్డి టౌన్: 78వ స్వాతంత్ర వేడుకల్లో భాగంగా సంగారెడ్డిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్​లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జెండా ఎగరవేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించి మాట్లాడారు. తెలంగాణ ప్రజల కలలు, ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు.

జిల్లాలో ప్రజాపాలన కింద గ్రామ సభలు నిర్వహించి 17 లక్షల 91,565 దరఖాస్తులు స్వీకరించామన్నారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామన్నారు. గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతు బీమా, రుణాలు మాఫీ చేశామని తెలిపారు. ఉద్యాన, వైద్య ఆరోగ్య , రాజీవ్ ఆరోగ్యశ్రీ, విద్యాశాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా చేపడుతున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారుల వివరాల ప్రగతిని చదివి వినిపించారు.

జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు సాధించిన ప్రగతిని తెలిపేలా రూపొందించిన శకటాల ప్రదర్శనను, చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించారు. ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. మహిళా సమైక్య సభ్యులకు రూ.255 కోట్ల 10 లక్షల చెక్కును అందించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.