- ఉత్సాహంగా తరలివచ్చిన ఓటర్లు
- పొద్దున్నుంచే కేంద్రాల వద్ద బారులు
- సొంతూర్లలో ఓటేసిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు
మెదక్/ సంగారెడ్డి/ సిద్దిపేట వెలుగు : మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో చిన్నచిన్న చెదురుమదురు సంఘటనలు మినహా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ మందకొడిగా ప్రారంభమైనా తర్వాత జోరందుకోవడంతో పలు చోట్ల ఓటర్లు బారులు తీరిన దృశ్యాలు కనిపించాయి. ఎండల తీవ్రత లేకపోవడంతో ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు.
వృద్ధులతోపాటు తొలిసారి పేరు నమోదైన యువతీయువకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అభ్యర్థుల భవితవ్యాన్ని బటన్ నొక్కి బ్యాలెట్ బాక్స్‌ల్లో నిక్షిప్తం చేశారు. పోలింగ్ బూత్‌కు సాయంత్రం 6 గంటల్లోగా చేరుకున్న వారికి రాత్రి వరకు ఓటింగ్‌కు అవకాశం కల్పించారు.
మొరాయించిన ఈవీఎంలు
మెదక్ జిల్లాలోని రేగోడ్మండల కేంద్రంలోని బూత్ నంబర్14లో మధ్యాహ్నం ఈవీఎం మొరాయించింది. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫిర్యాదుతో మండలం సెక్టోరియల్ ఆఫీసర్ జవేద్ మరో ఈవీఎం అమర్చారు. అనంతరం ఓటింగ్ సజావుగా కొనసాగింది. పాపన్నపేటలో బూత్ నంబర్19లో రెండుసార్లు ఈవీఎం స్టక్ కావడంతో ఓటర్లు కొంత సేపు ఇబ్బందులు పడ్డారు. శివ్వంపేట మండలం నవాపేట్ లోని 296 నంబర్ పోలింగ్ బూత్ లో దాదాపు గంట పాటు ఈవీఎం మొరాయించింది. సంగారెడ్డి జిల్లా హత్నూరలోని బూత్ నంబర్ 374లో ఉదయం 11.గం.లకు ఈవీఎం మొరాయించగా, సుమారు అరగంటకు పైగా పోలింగ్ నిలిచిపోయింది.
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరులోని 31 పోలింగ్ బూత్ లో రెండు సార్లు ఈవీఎం మొరాయించడంతో కొత్తది ఏర్పాటు చేశారు. కొమురవెల్లి మండలం కిష్టంపేటలో వీవీప్యాట్ మొరాయించంతో దాన్ని మార్చి కొత్తది ఏర్పాటు చేశారు. కోహెడ మండలం వింజపల్లి, రాంచంద్రాపూర్, బెజ్జంకి మండలం గుండారం, సిద్దిపేట పట్టణంలోని ఇందిరానగర్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూతుల్లో కొద్దిసేపు ఈవీఎంలు మొరాయించగా అధికారులు వాటిని సరి చేయడంతో పోలింగ్ కొనసాగింది.
ఎవరెవరు ఎక్కడ ఓటేశారంటే..
సిద్దిపేట మండలం చింతమడకలోని హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో మాజీ సీఎం కేసీఆర్ దంపతులు, హుస్నాబాద్ జూనియర్ కాలేజీలో మంత్రి పొన్నం ప్రభాకర్ తోపాటు కుటుంబ సభ్యులు, సిద్దిపేటలోని అంబిటస్ స్కూల్లో హరీశ్ రావు, దుబ్బాక మండలం పోతారంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక మండలం బొప్పాపూర్ లో మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దంపతులు, చిన్న కోడూరు మండలం గోనెపల్లిలో టీచర్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి దంపతులు ఓటు హక్కును నియోగించుకున్నారు.
ఎమ్మెల్సీ శేరి సుభాశ్ రెడ్డి కుటుంబ సమేతంగా సొంతూరు హవేలి ఘనపూర్ మండలం కూచన్‌పల్లిలో, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావ్ దంపతులు చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లిలో, నర్సాపూర్ఎమ్మెల్యే సునీతారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి సొంతూరు శివ్వంపేట మండలం గోమారంలో, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి రామాయంపేట మండలం కోనాపూర్, నర్సాపూర్మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కౌడిపల్లిలో ఓటు వేశారు. మెదక్లోక్సభ రిటర్నింగ్ఆఫీసర్, కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు ఔరంగాబాద్ పోలింగ్ స్టేషన్ లో క్యూలైన్లో నిల్చుని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
నారాయణ్ ఖేడ్‌లో కాంగ్రెస్అభ్యర్థి సురేశ్షెట్కర్, స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఓటు వేశారు. బీజేపీ జహీరాబాద్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అలాగే బీఆర్ఎస్ మెదక్ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తెల్లాపూర్ పోలింగ్ బూత్ లో ఓటు వేయగా, పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కుటుంబ సమేతంగా ఓటు వేశారు. కాంగ్రెస్‌పార్టీ మెదక్ అభ్యర్థి నీలం మధు చిట్కుల్ గ్రామంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పోలింగ్ శాతం వివరాలు
సెగ్మెంట్ 2023 అసెంబ్లీ 2024 పార్లమెంట్
మెదక్ 85.31 79.61
నర్సాపూర్ 88.04 83.73
సిద్దిపేట 76.33 73.15
గజ్వేల్ 84.14 79.07
దుబ్బాక 87.51 80.22
సంగారెడ్డి 75.42 68.48
పటాన్‌చెరు 69.87 61.00
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో సోమవారం సాయంత్రం ఐదు గంటల వరకు71. 91 శాతం పోలింగ్ నమోదైంది. రాత్రి 10 గంటల వరకు ఓటింగ్ జరగడంతో పూర్తిస్థాయిలో ఎంత పోలింగ్ జరిగిందనే దానిపై అధికారులకు స్పష్టత లేకపోవడంతో సాయంత్రం ఐదు గంటల వరకు జరిగిన పోలింగ్ శాతాన్ని వెల్లడించారు.
సెగ్మెంట్ పోలింగ్ శాతం
జహీరాబాద్ 70.54
నారాయణఖేడ్ 70.83
అందోల్ 73.69
జుల్కల్ 72.91
బాన్సువాడ 73.99
ఎల్లారెడ్డి 74.74
కామారెడ్డి 67.79