ప్రాణాలు పోతున్నా.. పట్టించుకోరా.. నత్తనడకన 365 బీ నేషనల్​హైవే పనులు

  • డేంజర్ ​జోన్​గా 365 బీ నేషనల్​హైవే పనులు
  • హెచ్చరికలు, సూచికలు మరిచిన అధికారులు
  • ఇప్పటికే ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

సిద్దిపేట/చేర్యాల, వెలుగు: జనగామ నుంచి చేర్యాల మీదుగా  దుద్దెడ  వరకు జరుగుతున్న 365 బీ నేషనల్​హైవే పనులు నత్తనడకన సాగుతున్నాయి.  పనులు  జరుగుతున్న ప్రదేశాల్లో ప్రమాద హెచ్చరిక  సూచికలు, రేడియం స్టిక్కర్లు,  డైవర్షన్ బోర్డులు  ఏర్పాటు చేయక పోవడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రి వేళల్లో వాహనాలపై వెళ్తున్న వారు సూచిక బోర్డులు లేకపోవడంతో  ప్రమాదాలకు గురవుతున్నారు.  ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా  పలువురు తీవ్రంగా గాయపడ్డారు.  నేషనల్​ హైవే పనులు ప్రారంభించి రెండేళ్లు గడుస్తున్నా ఆశించిన మేర పనులు జరగడం లేదు. 

రాత్రి సమయంలో ప్రమాదాలు అధికం

నేషనల్​హైవేపై రాత్రి సమయంలోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. పనులు జరుగుతున్న ప్రాంతాలు ఇరుకుగా మారడంతో ఇది తెలియక  వాహనదారులు వేగంగా వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారు. కల్వర్టుల వద్ద రోడ్డు డైవర్షన్ సూచించే బోర్డులను తాత్కాలికంగా ఏర్పాటు చేసినా రోడ్డుకు ఇరు పక్కల ఎలాంటి సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పనుల కోసం పది అడుగుల మేర గుంతలు తవ్విన చోట ప్రత్యేక జాగ్రత్తలు సూచించే బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా అలా జరగడం లేదు. ఇటీవల వర్షాలు కురవడంతో పనులు జరుగుతున్న ప్రాంతాల్లో రోడ్డు బురదమయమై ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడిన సంఘటనలు అనేకం ఉన్నాయి.

 ఇటీవల జరిగిన ప్రమాదాలు

-జనవరిలో చేర్యాల మండలం  దొమ్మాట గ్రామానికి చెందిన చల్లా లక్ష్మి బంధువుతో కలసి బైక్​పై వస్తుండగా గురిజకుంట వద్ద డోజర్ బండి వెనక్కి వస్తూ  ఢీకొట్టడంతో ఆమె అక్కడిక్కడే చనిపోయింది. మే 13న రాత్రి  చేర్యాల మండలం ఆకునూరు గ్రామానికి చెందిన  ఎండీ యాకుబ్ తన తల్లికి మందులు తీసుకురావడం కోసం బైక్​పై బయలు దేరి తాడూరు వద్ద నిర్మాణంలో ఉన్న కల్వర్టులో పడి మృతి చెందాడు. 

ఉదయం కూలీలు గుర్తించడంతో యాకుబ్ మరణించిన విషయం తెలిసింది.  ఫిబ్రవరి 10న కొమురవెల్లి మండలం కిష్టంపేటకు చెందిన రాజు చేర్యాల పట్టణ సమీపంలో హైవేపై  కారుతో సహా గుంతలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. మార్చిలో రామ్మూర్తి అనే వ్యక్తి గురిజకుంట వద్ద రాత్రిపూట ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. 

ప్రమాదాల నివారణకు ఏర్పాట్లు చేయాలి

నేషనల్​హైవే 365 బీ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రమాద నివారణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. అధికారుల పర్యవేక్షణ లోపం కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రాత్రి వేళల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నందున రేడియం స్టిక్కర్ల తో కూడిన సూచికలను ఏర్పాటు చేసి ప్రమాదాలు నివారించాలి. 

కొంగరి వెంకట మావో, చేర్యాల, సీపీఎం మండల కార్యదర్శి