ధరణి సమస్యలకు మోక్షం లభించేనా..!

  • సంగారెడ్డి జిల్లాలో 11,085 అప్లికేషన్లు పెండింగ్
  • తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న బాధితులు
  • సమీక్షలతోనే సరిపెడుతున్న ఆఫీసర్లు

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో ధరణి అప్లికేషన్లు 11,085 పెండింగ్ లో ఉన్నాయి. అత్యధికంగా సంగారెడ్డి డివిజన్ పరిధిలోని పటాన్ చెరు మండలంలో 1,364 అప్లికేషన్లు పెండింగ్ లో ఉండగా, నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని కల్హేర్ మండలంలో అతి తక్కువగా 6 అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో ధరణి సమస్యలపై దృష్టి పెట్టకపోవడంతో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టింది.

 ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉన్నతాధికారులు ఇటీవల జిల్లా కలెక్టర్లతో ధరణి సమస్యలపై చేపట్టిన సమీక్షలో పెండింగ్​అప్లికేషన్లు పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించారు. ధరణి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఉన్నతాధికారులు జిల్లా స్థాయిలో సూచిస్తున్నప్పటికీ కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అవి పరిష్కారం కావడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే బాధిత రైతులు మండలాల వారీగా ఇంకా తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. 

నాలుగు డివిజన్లలో..

జిల్లాలోని నాలుగు డివిజన్ల వారీగా ధరణి పెండింగ్ అప్లికేషన్లు పెద్ద మొత్తంలో ఉండడం బాధితులను కలవరపెడుతున్నాయి. సంగారెడ్డి డివిజన్ లో 7,226 అప్లికేషన్లు పెండింగ్​లో ఉండగా, జహీరాబాద్ డివిజన్ లో 1,772, ఆందోల్ డివిజన్ లో 1,504 , నారాయణఖేడ్ డివిజన్ లో 583 అప్లికేషన్లు పెండింగ్​లో ఉన్నాయి . ఆర్డీవోల స్థాయిలో మొత్తం 2,467 అప్లికేషన్లు పెండింగ్ లో ఉంచడంపై  రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎంతసేపు సమీక్షలతో కాలం వెళ్లదీస్తున్నారే తప్ప పరిష్కార మార్గాలు చూపించడం లేదని విమర్శిస్తున్నారు. 

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పటాన్ చెరు మండలంలో భూముల విలువ కోట్లల్లో పలకడంతో అక్కడి భూ సమస్యలు పరిష్కారమైతే తమ కుటుంబ ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయని అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి పెండింగ్ లో ఉన్న 1,364 భూ సమస్యలకు మోక్షం చూపించాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.