తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటలకు రాష్ట్రంలో 61.16శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓటింగ్ శాతం బాగానే జరిగినా.. మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ శాతం పోలింగ్ నమోదు అయ్యింది.
అయితే, ఓ తండాలో మాత్రం 100 శాతం పోలింగ్ నమోదైంది. మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట తండాలో 100 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. తండాలోని అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. తండాలో 95 మంది పురుషులు, 115 మంది మహిళలతో సహా మొత్తం 210 మంది ఓటర్లు ఉన్నారు. ఒక్కరూ కూడా మిస్ కాకుండా అందరూ ఓటు వేశారు. దీంతో తండావాసులను మెదక్ కలెక్టర్ అభినందించారు.