సంగారెడ్డి (న్యాల్కల్), వెలుగు: పెండ్లికి పెద్దలు అంగీకరించలేదని గురువారం ఓ ప్రేమ జంట సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం పుల్ కుర్తి మంజీరా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సిర్గాపూర్ మండలం కాకి జనవాడ గ్రామానికి చెందిన సదానందం (24), నారాయణఖేడ్ మండలం చాప్ట కె గ్రామానికి చెందిన ఉమా (20) వరుసకు బావ మరదళ్లు. ఇంటర్ వరకూ చదువుకున్నారు.
వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన ఇరువురి కుటుంబసభ్యుల పెద్దలు పెండ్లికి అంగీకరించ లేదు. దీంతో ఈనెల 4న ఇంటి నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఇద్దరి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వేర్వేరు పోలీస్స్టేషన్లలో మిస్సింగ్ కేసు నమోదైంది. గురువారం సదానందం, ఉమా డెడ్‌బాడీలు పుల్ కుర్తి మంజీరా నదిలో దొరికాయి. నది ఒడ్డున బైకు, రెండు సెల్ ఫోన్లను గుర్తించిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డెడ్‌బాడీలను కుటుంబసభ్యులకు అప్పగించి దర్యాప్తు చేస్తున్నారు.