వేతనం కోతపై బొగ్గు గని కార్మికుల నిరసన

కోల్ బెల్ట్, వెలుగు : వరద బాధితుల కోసం సింగరేణి ఉద్యోగుల జీతాల నుంచి ఎలాంటి సమాచారం లేకుండా ఒక రోజు వేతనం కోత విధించడం పట్ల కార్మికులునిరసన కు దిగారు. శనివారం మందమర్రి ఏరియా కేకే -5 గనిపై కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా కార్మికులు మాట్లాడుతూ... తమకు ముందస్తు ఎలాంటి సమాచారం, పర్మిషన్ లేకుండా వేతనం కోత విధించే నిర్ణయం సింగరేణి యాజమాన్యం తీసుకోవడం సరికాదన్నారు. 

వరదల వల్ల నష్టపోయిన వాళ్ళపై తమకు కూడా సానుభూతి ఉందని అన్ని గనుల పై సింగరేణి సహాయ నిధి పేరిట బాక్స్ లు ఏర్పాటు చేస్తి వరద బాధితులకి తమ వంతు సహాయం చేయడానికి సింగరేణి కార్మికులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్బంగా సింగరేణి తీరు వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ చేసి గని మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు.  

వరద బాధితులకు సీఎస్ఆర్ సాయం అందించాలి

నస్పూర్, వెలుగు   వరద బాధితులకు  సింగరేణి యాజమాన్యం సీఎస్ఆర్ నిధుల నుంచి సాయం అందించాలని హెచ్ఎమ్ఎస్ శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ తిప్పారపు సారయ్య, ఏరియా కార్యదర్శి అనిల్ రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్​ చేశారు. కార్మికుల అనుమతి లేకుండా వారి జీతంలో నుంచి ఎటువంటి రికవరీలు చేయవద్దని, కార్మికుల వద్ద విరాళాలు సేకరించాలనుకుంటే ప్రత్యేక బాక్స్ ఏర్పాటు చేసి సేకరించాలన్నారు.

 కొంత మంది అత్యుత్సాహంతో సింగరేణి కార్మికుల నుంచి ఒక్క రోజు వేతనం రికవరీ చేసి వరద బాధితులకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.