2024లో రూపాయికి గడ్డుకాలం .. జీవిత కాల కనిష్టానికి మన కరెన్సీ విలువ

  • జీడీపీ గ్రోత్ తగ్గడం, విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్ నుంచి భారీగా వెళ్లిపోవడమే కారణం
  • 2025 లో 82–87 మధ్య కదులుతుందని అంచనా

న్యూఢిల్లీ: రూపాయికి ఈ ఏడాది కలిసిరాలేదు.  డాలర్ మారకంలో మన కరెన్సీ విలువ   3 శాతం పతనమైంది. కొత్త కనిష్టాలకు పడిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో 83.19 దగ్గర ఉన్న రూపాయి, ఈ నెల 27 నాటికి 85.59 కి పడింది. గత రెండు నెలల్లోనే  రెండు రూపాయిలు  క్షీణించింది. కానీ, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలతో పోలిస్తే మన కరెన్సీలో హెచ్చుతగ్గులు తీవ్రంగా లేవు.  ఇండియా జీడీపీ వృద్ధి మందగించడంతో పాటు, డాలర్ విలువ బలపడడం రూపాయి విలువ పడడానికి కారణం. 

కొత్త ఏడాదిలో మన కరెన్సీ  నిలకడగా ఉంటుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.  ఈ ఏడాది రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ముదిరిన విషయం తెలిసిందే. దీంతో  పాటు, ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం, మిడిల్‌‌‌‌ ఈస్ట్‌‌‌‌లో నెలకొన్న వివిధ సమస్యలు, ఎర్ర సముద్రంలో గూడ్స్ రాకపోకలకు అంతరాయం ఏర్పడడం వంటివి గ్లోబల్ ఆర్థిక వ్యవస్థతో పాటు ఇండియాపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు తీసుకున్న నిర్ణయాలు కేవలం రూపాయిని మాత్రమే కాదు వివిధ ఎమెర్జింగ్ కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఇతర మేజర్ కరెన్సీల కంటే  డాలర్‌‌‌‌‌‌‌‌ మారకంలోనే రూపాయి విలువ తక్కువగా పడింది. జపనీస్ యెన్‌‌‌‌, యూరో మారకంలో  పెరిగింది కూడా. 

అంచనాలకు మించి బలపడిన డాలర్‌‌

రూపాయి విలువ డాలర్ మారకంలో తగ్గినా, యూరో, జపనీస్ యెన్‌‌‌‌ మారకంలో పెరిగింది. ఈ ఏడాది జనవరి 1 న 100 యెన్‌‌‌‌లకు రూ.58.99 ఉన్న రూపాయి మారకం విలువ, ఈ నెల 27 నాటికి రూ.54.26 కి బలపడింది. ఇది 8.7శాతం గ్రోత్‌‌‌‌కు సమానం.  అదే ఒక యూరో మారకంలో ఈ ఏడాది ఆగస్టులో రూ.93.75  ఉన్న రూపాయి విలువ, డిసెంబర్ 27 నాటికి రూ.89.11 కి బలపడింది. 5 శాతం పెరిగింది.  డాలర్ అంచనాలకు మించి బలపడడమే ఇందుకు కారణమని  నిపుణులు చెబుతున్నారు. యూఎస్‌‌‌‌లో ఎకానమీ పుంజుకోవడం, ఫెడ్‌‌‌‌ మానిటరీ పాలసీని సులభం చేయడం, యూఎస్ ప్రెసిడెంట్ ఎన్నికలు వంటివి డాలర్ బలపడడానికి కారణాలు. 

మరోవైపు యూఎస్ ప్రెసిడెంట్‌‌‌‌గా ఎన్నికైన డొనాల్డ్‌‌‌‌ ట్రంప్ ఇప్పటికే చైనీస్ దిగుమతులపై టారిఫ్స్ పెంచుతామని ప్రకటించారు. దీంతో కరెన్సీ ట్రేడర్లు   డాలర్లను భారీగా కొంటున్నారు. ఇండియా ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లు వెళ్లిపోవడానికి ఇదొక కారణం. ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌–డిసెంబర్ మధ్య ఎఫ్‌‌‌‌ఐఐలు ఇండియా స్టాక్ మార్కెట్ నుంచి నికరంగా రూ.1.70 లక్షల కోట్లను విత్‌‌‌‌డ్రా చేసుకున్నారు. ఈ ఫండ్స్‌‌‌‌లో మెజార్టీ వాటా డాలర్లలోకి వెళ్లాయని అంచనా.    కొత్త ఏడాదిలో రూపాయి నిలకడగా ఉంటుందని, డాలర్ మారకంలో 82–87 మధ్య కదలాడుతుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.

డాలర్లు తెగ కొంటున్నరు

ఆయిల్ డిమాండ్‌‌‌‌ను చేరుకోవడానికి దిగుమతులపై ఇండియా ఆధారపడాల్సి వస్తోంది. సాధారణంగా  దిగుమతులకు చేసే చెల్లింపులు డాలర్లలో జరుగుతాయి. దీంతోపాటు ఇతర కారణాల వలన డాలర్‌‌‌‌‌‌‌‌కు ఈ ఏడాది బాగా డిమాండ్ పెరిగింది.  ఇండియా ట్రేడ్ డెఫిసిట్‌‌‌‌ (దిగుమతులు, ఎగుమతుల మధ్య తేడా) పెరగడం రూపాయిపై  ప్రభావం చూపుతోంది.  ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ జోక్యం చేసుకోవడంతో రూపాయి పతనం తీవ్రంగా లేదు. సాధారణంగా తన దగ్గరున్న డాలర్లను అమ్మడం ద్వారా రూపాయి విలువను పెంచడానికి ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ప్రయత్నిస్తుంది. ఫలితంగానే  ఇండియా ఫారెక్స్ నిల్వలు ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో 704.89 బిలియన్ డాలర్ల దగ్గర ఆల్ టైమ్‌‌‌‌ హై చేరుకున్నా, అక్కడి నుంచి పడుతూ వచ్చాయి. ఈ నెల 20 తో ముగిసిన వారంలో 644.39 బిలియన్ డాలర్లకు తగ్గాయి.