కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లాలో భారీ వర్షం పడడంతో సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచింది. బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల్లోని ఎస్సార్పీ ఓసీపీ, ఇందారం ఓసీపీ, రామకృష్ణాపూర్ ఓసీపీ, కేకే ఓసీపీ, ఖైరీగురా ఓసీపీల్లోకి నీరు చేరింది.
దీంతో సుమారు 25 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అలాగే ఐదు లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ వెలికితీత నిలిచిపోయింది. గనుల్లో నిలిచిన నీటిని మోటార్ల సాయంతో బయటకు పంపుతున్నట్లు ఆఫీసర్లు తెలిపారు. మరోవైపు ఓసీపీ రహదారులన్నీ బురదమయంగా మారడంతో హెవీ వెహికల్స్ రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడడంతో అవి ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.