- మెరుగైన చికిత్స అందిస్తామని భరోసా
- చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటన
- పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిసి పలు కార్యక్రమాలకు హాజరు
కోల్బెల్ట్/కోటపల్లి/చెన్నూరు, వెలుగు:విష జ్వరాలతో బాధపడుతున్న వారికి మెరుగైన చికిత్స అందిస్తామని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి భరోసా ఇచ్చారు. అవసరమైనవారిని పెద్ద ఆస్పత్రులకు తరలించి ట్రీట్మెంట్ అందేలా చూస్తామన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో జ్వర బాధితులను ఆయన పరామర్శించారు. మెడికల్ క్యాంపు డాక్టర్ ఆరుణశ్రీతో మాట్లాడి జర్వాల తీవ్రత, పేషెంట్లకు అందిస్తున్న వైద్యం గురించి అడిగితెలుసుకున్నారు.
జ్వర పీడితులకు సత్వరమే మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తూ తొందరగా కొలుకునేలా చూడాలని సూచించారు. మెరుగైన వైద్యం అవసరమైతే వెంటనే పెద్ద ఆస్పత్రులకు తరలించాలని ఆదేశించారు. అంతకుముందు స్థానిక కాంగ్రెస్క్యాడర్ తో కలిసి గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ గ్రామస్తుల ఆరోగ్య పరిస్థితులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. జ్వరాలు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో రోడ్డు, హైవేపై బస్ షెల్టర్ నిర్మించాలని గ్రామస్తులు కోరగా సానుకూలంగా స్పందించారు. వెంటనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
అగ్ని ప్రమాద బాధితులను ఆదుకుంటాం..
చెన్నూరు మండలం అస్నాద్ గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ఇండ్లు దగ్ధమైన ఘటనలో ఇంగిలి శ్రీనివాస్, ఇంగిలి లింగయ్య బాధిత కుటుంబాలను కూడా వివేక్ వెంకటస్వామి పరామర్శించి, ఆర్థికసాయం చేశారు. అనంతరం చెన్నూరు క్యాంపు ఆఫీస్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఎమ్మెల్యే వెంట జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, కోటపల్లి, చెన్నూరు ఎస్సైలు రాజేందర్, శ్వేత, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, కోటపల్లి మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ తివారీ, నాయకులు కుర్మ రాజమల్లగౌడ్, బాపగౌడ్, బాపిరెడ్డి, సుశీల్, చెన్న సూర్యానారాయణ తదితరులు పాల్గొన్నారు.
కాగా, మంచిర్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం జరిగిన వివాహ వేడుకలకు ఎమ్మెల్యే వివేక్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. ఇటీవల యాక్సిడెంట్ లో చనిపోయిన కాంగ్రెస్ కార్యకర్త దుర్గం కుబీర్ కుటుంబాన్ని పరామర్శించారు. కాగా, సింగరేణి కార్మికవాడల్లో నెలకొన్న సమస్యలు, పరిష్కారంపై అధికారులతో వివేక్ బుధవారం చర్చించారు. మంచిర్యాలలోని తన నివాసంలో ఈ మేరకు మందమర్రి ఏరియా సింగరేణి జీఎం దేవేందర్, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, ఇతర అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.