- కల్వర్టు మరమ్మతులు పూర్తయినయ్
- రాకపోకల ఇబ్బందులు తొలిగాయని వ్యాఖ్య
- కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు
చెన్నూరు / కోల్‌బెల్ట్, వెలుగు: చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని వడ్డేపల్లి గ్రామానికి వెళ్లే రూట్లో కల్వర్టు వద్ద వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. సోమవారం రాత్రి ఆయన వడ్డేపల్లి వాగు కల్వర్టు మరమ్మతు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘భారీ వర్షాల కారణంగా రెండు రోజుల కింద వడ్డేపల్లి వెళ్లే మార్గంలో వాగుపై ఉన్న కల్వర్టు కొట్టుకుపోయింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ లీడర్లు నా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే కలెక్టర్ కుమార్ దీపక్‌తో మాట్లాడిన. మరమ్మతులు చేయాలని ఆదేశించాను. కల్వర్టు పనులు పూర్తికావడంతో రాకపోకలకు ఇబ్బంది తొలగిపోయింది. చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా సైడ్ డ్రైయినేజీలు, రోడ్లు నిర్మిస్తాం’’అని వివేక్ అన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో సుందరశాల గ్రామంలో మునిగిన పొలాలను మంగళవారం పరిశీలిస్తానని తెలిపారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ద్వారా పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు. వడ్డేపల్లి కల్వర్టు ఉన్న చోట వంతెన నిర్మించాలని, ఒక బోరు వేయించాలని గ్రామస్తులు కోరగా.. వివేక్ వెంకటస్వామి సానుకూలంగా స్పందించారు. కల్వర్టుకు మరమ్మతులు చేయించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. చెన్నూరు పట్టణం బేతాళవాడలోని కాంగ్రెస్ కార్యకర్త కడవండి మహేశ్ భార్య మంజుల చనిపోగా.. సోమవారం రాత్రి బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఎమ్మెల్యే వివేక్ వెంట మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, లీడర్లు సుశీల్ కుమార్, చింతల శ్రీనివాస్, పాతాళ నాగరాజు, కొంపెల్లి బాణేశ్, రవి, అన్వర్, ముత్తు నారాయణ, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.