బెల్లంపల్లి నియోజకవర్గ సమస్యలు తీర్చండి : గడ్డం వినోద్

 

  • సీఎం రేవంత్‌‌ రెడ్డికి ఎమ్మెల్యేలు వినోద్, వివేక్ విజ్ఞప్తి
     
    బెల్లంపల్లి రూరల్, వెలుగు: బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని సీఎం రేవంత్​రెడ్డికి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం అసెంబ్లీలో ఆయన సోదరుడు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి సీఎం రేవంత్‌‌ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. నెన్నెల మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా ఫారెస్ట్ క్లియరెన్స్ లేక నిలిచిపోయిన రోడ్ల నిర్మాణాలకు వెంటనే అనుమతులు ఇచ్చేలా చూడాలని కోరారు.

 వేమనపల్లి మండలం మల్లంపేట -నీల్వాయి, వేమనపల్లి- నాగారాం, కళ్లంపల్లి- మోట్లగూడ వరకు రోడ్ల నిర్మాణానికి ఫారెస్ట్ పర్మిషన్ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించి త్వరలోనే అనుమతులు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. సీఎంతో పాటు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖకు కూడా వారు వినతిపత్రం అందజేశారు. వీరి వెంట గొల్లపల్లి మాజీ ఎంపీటీసీ బొమ్మెన హరీశ్ గౌడ్, వేమనపల్లి మాజీ జడ్పీటీసీ సంతోష్​కుమార్, బెల్లంపల్లి మార్కెట్​కమిటీ మాజీ వైస్​చైర్మన్​ మాధవరపు నర్సింగరావు, భీమిని, కన్నెపల్లి మండలాల కాంగ్రెస్ ​పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, రామాంజనేయులు ఉన్నారు.