హుస్నాబాద్, వెలుగు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్‌లోని మహాసముద్రంగండి చెరువును టూరిజం స్పాట్‌గా మారుస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇందుకోసం త్వరలోనే ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. చుట్టూ గుట్టల మధ్యన లోయలో సహజసిద్ధంగా ఏర్పడిన చెరువును ఆయన సోమవారం పరిశీలించారు. భారీ వానలకు గతంలో ఈ చెరువుకు గండిపడడంతో నీరంతా వృథాగా పోయేది. గత ప్రభుత్వం రూ.6.55 కోట్లతో గండిని పూడ్చివేయించినా, టూరిజం పరంగా చెరువును డెవలప్ చేయలేదు.
ఈ చెరువు నిండితే హుస్నాబాద్, చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లోని ఇరవై గ్రామాల్లో భూగర్భజలాలు పెరుగుతాయి. మహాసముద్రంగండిలో 0.5 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంటాయి. ఒకసారి నిండితే రెండేండ్లపాటు వానలు లేకున్నా చుట్టుపక్కల గ్రామాల్లో నీటికి కరువు ఉండదు. దీనిని ఒక పెద్ద పర్యటక క్షేత్రంగా చేయడం కోసం టూరిజం శాఖ అధికారులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. చెరువు నుంచి నీరు వెళ్లే తూము, మత్తడిని పరిశీలించి కొద్దిసేపు అక్కడే ఉన్నారు. ఆరుద్ర పురుగును చేతిలో పెట్టుకుని చూస్తూ మురిసిపోయారు. ఆయన వెంట కలెక్టర్ మనుచౌదరి, ఆర్డీవో రామ్మూర్తి ఉన్నారు.