- కడెంలో వేగంగా పెరుగుతున్న నీటిమట్టం
- మూడు గేట్ల ఎత్తివేత
- గడ్డన్న వాగు, స్వర్ణ ప్రాజెక్టుల్లోకీ పెరుగుతున్న ప్రవాహం
నిర్మల్, వెలుగు: నిర్మల్‌జిల్లా వ్యాప్తంగా రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా జిల్లాలోని కడెం, గడ్డెన్న వాగు, స్వర్ణ ప్రాజెక్టుల్లోకి పెద్దఎత్తున వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది.
ప్రస్తుతం 15338 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ప్రాజెక్టులోకి వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603 టీఎంసీలు) కాగా ప్రస్తుత నీటిమట్టం 690.400 అడుగులు,(5.345 టీఎంసీల)లకు చేరింది. అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి దిగువనున్న గోదావరిలోకి 11022 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. స్వర్ణ ప్రాజెక్టులోకి కూడా క్రమంగా ఇన్ ఫ్లో పెరుగుతోంది. ప్రస్తుతం 330 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉన్నట్లు ఆఫీసర్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 1.484 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి మట్టం 0.728 టీఎంసీలుగా ఉంది. గడ్డన్న వాగు ప్రాజెక్టులోకి కూడా వరద ప్రవాహం చేరుకుంటోంది.
-
లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక
కడెం ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో వేగంగా పెరుగుతున్న కారణంగా ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఈఈ విఠల్ ఓ ప్రకటనలో హెచ్చరించారు. ముఖ్యంగా పశువులు, మేకలు, గొర్రెల కాపరులు వాగు పరివాహక ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల సైతం హెచ్చరికలు జారీ చేశారు. ప్రాజెక్టుల పరివాహక ప్రాంతాల్లోకి వెళ్లొద్దని.. వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయొద్దన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.