బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడి.. నిందితుడికి 20 ఏండ్ల జైలు

నిర్మల్‌‌, వెలుగు: పెండ్లి చేసుకుంటానని బాలికను నమ్మించి కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడిన నిందితుడికి 20 ఏండ్ల జైలుశిక్ష, రూ.1500 జరిమానా విధిస్తూ గురువారం నిర్మల్ పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు స్పెషల్ జడ్జి కర్ణకుమార్ తీర్పు ఇచ్చారు. కోర్టు లైజన్ ఆఫీసర్ డల్లు సింగ్ తెలిపిన ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన దుర్కే బాలాజీ భార్య పిల్లలతో కలిసి నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం తర్లపాడుకు వచ్చి ఇటుక బట్టిలో పని చేస్తున్నాడు. మధ్యప్రదేశ్ కు చెందిన చాంద్ కుమార్ మరవి కూడా అదే ఇటుక బట్టిలో కూలి. 

కాగా బాలాజీ కూతురిని (మైనర్) ప్రేమిస్తున్నానని, పెండ్లి చేసుకుంటానని చాంద్ కుమార్ నమ్మించి 2023లో కిడ్నాప్ చేసి సొంతూరికి తీసుకెళ్లి పలుసార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబం ఖానాపూర్ పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో చార్జ్ షీటు దాఖలు చేశారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ విశ్వాస్ రెడ్డి15 మంది సాక్షులను విచారించగా నిందితుడు చాంద్ కుమార్ పై నేరం రుజువైంది. దీంతో జడ్జి కర్ణకుమార్ తీర్పు చెప్పారు.