హైదరాబాద్‎లో లగ్జరీ ఇండ్లకు మస్తూ గిరాకీ

  • ఇతర కేటగిరీలకు మాత్రం తక్కువే ,నైట్​ఫ్రాంక్​ రిపోర్ట్​ వెల్లడి

హైదరాబాద్​, వెలుగు:మిగతా కేటగిరీల ఇండ్లకు డిమాండ్ ​పడిపోతున్నా, లగ్జరీ/విశాలమైన ఇండ్లకు మాత్రం హైదరాబాద్​లో గిరాకీ పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది నవంబరులో 5,516 రెసిడెన్షియల్​ యూనిట్లు అమ్ముడయ్యాయి. వీటి అమ్మకాలు వార్షికంగా 12 శాతం, నెలవారీగా ఆరు శాతం తగ్గాయి. ఇదేకాలంలో రూ.కోటి కంటే ఎక్కువ ధరల గల ఇండ్ల వాటా మొత్తం అమ్మకాల్లో 14 శాతం ఉంది. అంతకుముందు సంవత్సరం 12 శాతం మాత్రమే వృద్ధి కనిపించింది. పెద్ద ఇండ్లు భారీ ఎత్తున అమ్ముడవుతున్నాయి. వెయ్యి నుంచి రెండు వేల చదరపు అడుగుల వరకు ఉండే వాటిని పెద్ద ఇండ్లుగా పరిగణిస్తారు. మొత్తం రిజిస్ట్రేషన్లలో వీటి వాటా 69 శాతం ఉంది. అయితే గత ఏడాది నవంబరులో ఇది 71 శాతం ఉంది.

రెండువేల చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం గల ఇండ్ల అమ్మకాల వాటా మొత్తం రిజిస్ట్రేషన్లలో 14 శాతం ఉంది. ప్రస్తుత సంవత్సరంలో హైదరాబాద్​రియల్​ ఎస్టేట్​ మార్కెట్లలో నవంబరు నెల వరకు 70,796 ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వార్షికంగా ఇవి 12 శాతం పెరిగాయి. ఈ లావాదేవీల విలువ రూ.43,574 కోట్లు ఉంటుందని నైట్​ఫ్రాంక్​ తెలిపింది. రూ.కోటి కంటే ఎక్కువ ధర గల ఇండ్లను కొనడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారని నైట్​ఫ్రాంక్​ఇండియా సీఎండీ శిశిర్ ​బైజాల్​ చెప్పారు. 

మేడ్చల్​లో అత్యధికం

మొత్తం రిజిస్ట్రేషన్లలో 42 శాతం మేడ్చల్​–మల్కాజ్​గిరి జిల్లాలోనే జరిగాయి. రంగారెడ్డి 41 శాతం వాటాతో రెండోస్థానంలో, 14 శాతం రిజిస్ట్రేషన్లతో హైదరాబాద్​జిల్లా మూడోస్థానంలో ఉంది. ఈ జిల్లాలో గత నవంబరులో 17 శాతం రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ ఏడాది నవంబరులో ఇండ్ల ధరలు వార్షికంగా ఆరుశాతం పెరిగాయి. మేడ్చల్​–మల్కాజ్​గిరి జిల్లాలో ఏకంగా 11 శాతం, హైదరాబాద్​జిల్లాలో 10 శాతం, రంగారెడ్డి జిల్లాలో ఒకశాతం పెరుగుదల కనిపించింది. మూడు వేల చదరపు మీటర్లు, అంతకంటే ఎక్కువ స్థలంలోని ఇండ్లను లగ్జరీ కేటగిరీగా పేర్కొంటారు. సోమాజీగూడ, బంజారాహిల్స్​, జూబ్లీహిల్స్​లో వీటి అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి.