ఎన్​హెచ్ 63 భూసేకరణకు బ్రేక్

  • అలైన్​మెంట్ మార్పులపై హైకోర్టును ఆశ్రయించిన రైతులు
  • కౌంటర్ వేయాలని ఎన్​హెచ్ఏఐ అధికారులకు కోర్టు ఆర్డర్
  • అప్పటివరకు రైతులను భూముల్లోంచి పంపవద్దని ఆదేశం 

మంచిర్యాల, వెలుగు: నేషనల్ హైవే 63లో భాగంగా లక్సెట్టిపేట నుంచి మంచిర్యాల వరకు ఫోర్ లేన్ రోడ్డు నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియకు టెంపరరీగా బ్రేక్ పడ్డది. భూములు కోల్పోతున్న పలువురు రైతులు మూడుసార్లు అలైన్​మెంట్ మార్చడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కౌంటర్ ఫైల్ చేయాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్​హెచ్ఏఐ) అధికారులను ఆదేశించింది.

అధికారులు ఈ నెల 18 వరకు గడువు కోరగా తదుపరి విచారణ జరిగేంతవరకు రైతులను భూముల్లోంచి పంపరాదని ఆదేశించింది. అలాగే 2013 భూసేకరణ చట్టం ప్రకారం నడుచుకోవాలని మూడ్రోజుల క్రితం ఆర్డర్స్ జారీ చేసింది.

1306.57 ఎకరాలు సేకరణ 

నిజామాబాద్–జగ్దల్​పూర్ ఇంటర్ కారిడార్ ఎన్​హెచ్ 63లో భాగంగా ఆర్మూర్ నుంచి మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి వరకు 131.89 కిలోమీటర్లు ఫోర్​ లేన్ నిర్మాణం జరగనుంది. అంచనా వ్యయం రూ.5,354.12 కోట్లు. జిల్లాలోని లక్సెట్టిపేట, హాజీపూర్, మంచిర్యాల, మందమర్రి మండలాల్లోని 17 గ్రామాల మీదుగా ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు వెళ్తుంది. దీనికోసం 1,421.32 ఎకరాల భూసేకరణకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్​హెచ్ఏఐ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో 71.22 ఎకరాలు గవర్నమెంట్, 43.50 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ కాగా, 1,306.57 ఎకరాలు ప్రైవేట్ భూములు పోతున్నాయి.

2018 నుంచి ఇప్పటివరకు మూడుసార్లు అలైన్​మెంట్ మార్చారు. కొంతమంది భూస్వాములు, లీడర్లు వారి భూములు నష్టపోకుండా ఎన్​హెచ్ఏఐ అధికారుల దగ్గర లాబీయింగ్ చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఓసారి ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూములు పోయిన తమకు గ్రీన్ ఫీల్డ్ హైవే వల్ల మరోసారి మిగిలిన భూములు కూడా కోల్పోయే పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు.