నిజాంపేట, వెలుగు:18 నెలలుగా కిరాయి చెల్లించడం లేదని తహసీల్దార్ కార్యాలయానికి ఇంటి ఓనర్ తాళం వేశారు. ఈ సంఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం జరిగింది. ఇంటి యజమాని శ్రీధర్ రెడ్డి ఆఫీస్ కు తాళం వేశాడని అటెండర్ సత్యనారాయణ ఫోన్ లైన్ లో తహసీల్దార్ సురేశ్ కుమార్ కు తెలిపారు. స్పందించిన తహసీల్దార్సోమవారం వరకు పెండింగ్ లో ఉన్న అద్దె ను చెల్లిస్తామని ఇంటి ఓనర్ కు ఫోన్ లో హామీ ఇవ్వడంతో ఓనర్ తాళం తీశాడు.
ఇంటి యాజమాని శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం 2016 లో నిజాంపేట కొత్త మండలంగా ఏర్పడిన తర్వాత ఆయన ఇల్లును తహసీల్దార్ ఆఫీసుకు అద్దెకు తీసుకున్నారు. అధికారులు 2022 డిసెంబర్ వరకు అద్దె చెల్లించారు. తర్వాత నుంచి అద్దె చెల్లించలేదు. 18 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో ఆఫీస్ కు తాళం వేశానని పేర్కొన్నారు. సోమవారం వరకు అద్దె చెల్లించకపోతే మంగళవారం తాళం వేస్తానని పేర్కొన్నారు.