ఆదిలాబాద్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్​ ప్రారంభం

ఆదిలాబాద్, వెలుగు: ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ ను శుక్రవారం కలెక్టర్ రాజర్షి షా బ్యాంక్ చైర్మన్ శోభతో కలసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ముత్నూర్ గ్రామస్తులకు బ్యాంక్ సేవలు మరింత చేరువయ్యాయని, గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్వయం సహాయక సంఘాలు బ్యాంక్ ల ద్వారా రుణాలు పొంది తిరిగి సకాలం లో చెల్లించాలని సూచించారు. అనంతరం రూ.20 కోట్ల చెక్కును మహిళా సంఘాల గ్రూప్ లకు అందజేశారు. సబ్ కలెక్టర్ యువరాజ్ మార్మట్, ట్రైనీ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఉత్పల్ కుమార్, ఆర్ఎం ప్రభుదాస్ పాల్గొన్నారు.

ఏజెన్సీలోని రోడ్లు, భవనాలు త్వరగా పూర్తిచేయాలి

ఆదిలాబాద్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చేపట్టిన రోడ్లు, వంతెనలతో పాటు ఆశ్రమ స్కూళ్లలోని భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా సూచించారు. శుక్రవారం ఇంజనీరింగ్ అధికారులతో ఐటీడీఏ ఆఫీసులో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆశ్రమ స్కూళ్లలో అసంపూర్తిగా ఉన్న వసతి భవనాలు, అదనపు తరగతి గదులు, వంట గదులు, మరుగుదొడ్ల పనులు స్పీడప్ చేయాలని సూచించారు. అంగన్వాడీ సెంటర్లు, సీసీ రోడ్లు, వంతెనల నిర్మాణాలు నెల వ్యవధిలో పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఈఈ నిరంజన్, డీఈ శివ ప్రసాద్, సతీశ్, ఏఈలు పాల్గొన్నారు. 

రాజకీయ కక్షతోనే కేటీఆర్​పై కేసు

భైంసా, వెలుగు: ఫార్మూలా–ఈ కార్ ​రేసింగ్​విషయంలో రాజకీయ కక్షతోనే సీఎం రేవంత్​రెడ్డి సర్కారు బీఆర్ఎస్ వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్​పై కేసు నమోదు చేయించారని ఆ పార్టీ ముథోల్​నియోజకవర్గ సమన్వయ సమితి సభ్యులు డా. కిరణ్​కుమార్​మండిపడ్డారు. శుక్రవారం భైంసాలో మీడియాతో మాట్లాడారు. ఈ కార్​ రేసింగ్​లో కేటీఆర్​ అవకతవకలకు పాల్పడ్డారని ప్రభుత్వం పెట్టిన కేసు అక్రమమన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న కేటీఆర్​ను చూసి రేవంత్​ రెడ్డి భయపడుతున్నారని అన్నారు. అసెంబ్లీలో చర్చ పెడితే సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని కేటీఆర్​అన్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందన్నారు. తక్షణమే అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ ​చేశారు. 

ఉద్యోగుల వంటావార్పు

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్​ చేయాలని వారు డిమాండ్​చేశారు. శుక్రవారం ఆదిలాబాద్​ పట్టణంలోని ఎన్టీఆర్​ చౌక్​లో వంటావార్పు కార్యక్రమం నిర్వహించి రహదారిపై సహపంక్తి భోజనాలు చేసి నిరసన తెలిపారు. సీఎం వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు.

ఖానాపూర్ కోర్టు ఏజీపీగా ఆసిఫ్ అలీ 

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు అడిషనల్ ప్రభుత్వ న్యాయవాది (ఏజీపీ)గా ఖానాపూర్ పట్టణం కరీం కాలనీకి   చెందిన  ఆసిఫ్ అలీని   నియమిస్తూ 
రాష్ట్ర ప్రభుత్వ న్యాయ వ్యవహారాల శాఖ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆసిఫ్ అలీ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తరపున సివిల్ కేసులపై కోర్టులో బలంగా వాదనలు 
వినిపిస్తానన్నారు.

 సైబర్ నేరాలపై అలర్ట్​గా ఉండాలి

నేరడిగొండ, వెలుగు: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లీడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ దేబోజిత్ బరువా సూచించారు. నేరడిగొండ మండలంలోని తర్నం గ్రామంలో ఆర్ బీఐ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..బ్యాంక్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని,  ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రతా పథకాలు, లోన్స్ ఉపయోగించుకోవాలని సూచించారు. రైతులు తీసుకున్న పంట రుణాలను సకాలంలో రెన్యువల్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో క్లస్టర్ కోఆర్డినేటర్ గంగాధర్, పంచాయతీ సెక్రటరీ స్వామి, ఆర్థిక అక్షరాస్యత కౌన్సిలర్లు సంతోష్, దంజీ, అరవింద్, గ్రామస్తులు పాల్గొన్నారు.