పెండింగ్​ హౌసింగ్​ బిల్లులు విడుదల చేయండి : విఠల్ రెడ్డి

  • మంత్రి పొంగులేటికి విఠల్​రెడ్డి వినతి

భైంసా, వెలుగు: ముథోల్ నియోజకవర్గంలో డబుల్​బెడ్రూం ఇండ్లకు సంబంధించి హౌసింగ్​పెండింగ్​ బిల్లులను వెంటనే విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం హైదరాబాద్​లో ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. భైంసాలో 660 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ ఫ్లోరింగ్, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, ఇతర పనులు పూర్తి కాలేదన్నారు. 

ఆ పనుల కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే కొన్ని గ్రామాల్లో నిర్మించిన డబుల్​బెడ్రూం ఇండ్లు తుది దశలో ఉన్నాయని, వాటి పెండింగ్​బిల్లులు ఇవ్వాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్లను త్వరగా అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. భైంసాలో లక్కీ డ్రాలో ఎంపికైన లబ్ధిదారులను ఇండ్లలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలన్నారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు విఠల్​రెడ్డి తెలిపారు.