సంగారెడ్డి జిల్లాలో బయటపడ్డ సీఎంఆర్​ దందా

  • సంగారెడ్డి జిల్లాలో మిల్లర్ల కు సివిల్​ సప్లై వత్తాసు
  • ఇన్నాళ్లూ బియ్యం పెండింగ్​ లేవవని మభ్యపెట్టిన ఆఫీసర్లు
  • తీరా కమిషనర్​కు ఇచ్చిన నివేదికలో వాస్తవాలు బట్టబయలు
  • 2లక్షల మెట్రిక్​టన్నుల బియ్యం పెండింగ్​లో ఉన్నట్లు వెల్లడి
  • ఆ బియ్యం ఉన్నాయా, మిల్లర్లు అమ్ముకుతిన్నారా? అనే అనుమానాలు

సంగారెడ్డి, వెలుగు: జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) దందా జోరుగా సాగుతోంది. రైతులు పండించిన ధాన్యాన్ని అధికారులు సేకరించి రైస్ మిల్లులకు అప్పగిస్తే మిల్లర్లు ప్రభుత్వానికి అప్పజెప్పకుండా పక్కదారి మళ్లిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. సివిల్ సప్లై అధికారులు మిల్లర్లకు వత్తాసు పలుకుతూ కోట్లాది రూపాయల ధాన్యాన్ని అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

జిల్లాలో 2,03,199 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ పెండింగ్ లేదని..పైగా రైస్ మిల్లర్లు సీఎంఆర్ ఇవ్వడంలో ముందున్నారని అధికారులు వెనకేసుకు రావడం విమర్శలకు తావిస్తోంది. 2022 నుంచి సీఎంఆర్ రైస్ పెండింగ్ లో ఉందనే విషయం సివిల్ సప్లై అధికారులు ఈ నెల 1న సివిల్ సప్లై కమిషనర్ కు నివేదికలు ఇవ్వడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ఆ రిపోర్టులో 2,03,199 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు పేర్కొన్నట్టు తెలిసింది. సీఎంఆర్ లెక్కల్లో గందరగోళం నెలకొనడంతో అధికారులు దిద్దుబాటు చర్యలకు సిద్ధమయ్యారు.

ఇవ్వాల్సింది 2,03,199 మెట్రిక్ టన్నులు

జిల్లాలో మొత్తం 68 రైస్ మిల్లులు ఉండగా 2022,-23  యాసంగి వరిధాన్యం 1,67,290 మెట్రిక్ టన్నులు సేకరించి 1,13,237మెట్రిక్ టన్నులు సీఎంఆర్ కు అప్పగించారు. అందులో సీఎంఆర్ కింద 65,743 మెట్రిక్ టన్నులు డెలివరీ చేయగా ఇంకా 47,494 మెట్రిక్ టన్నులు బ్యాలెన్స్ ఉంది. రెండేళ్లు గడిచిపోయినా సీఎంఆర్ ధాన్యాన్ని ప్రభుత్వానికి రైస్ మిల్లులు అప్పగించలేదు.

అలాగే 2023,-24 వానకాలానికి సంబంధించి 1,76,760 వరి ధాన్యం సేకరించారు. అందులో సీఎంఆర్ కోసం18,624 మెట్రిక్ టన్నులు అప్పగించగా 57,275 మెట్రిక్ టన్నుల రైస్ ను ఎఫ్ సీఐకి  సీఎంఆర్ డెలివరీ చేశారు. ఇంకా 10,0861 మెట్రిక్ టన్నుల రైస్ ఇవ్వాల్సి ఉంది. 2023,-24 యాసంగికి సంబంధించి కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లాలో 1,38,760 మెట్రిక్ టన్నుల వరిధాన్యం సేకరించారు. అందులో నుంచి 94,356 సీఎంఆర్ కు అప్పగించినప్పటికీ ఇప్పటి వరకు మర పెట్టలేదు. ఈ మొత్తం సీఎంఆర్ బ్యాలెన్స్ ఉంది.

ఏప్రిల్ తో ముగిసిన గడువు

ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఎంఆర్ రైస్ అప్పగించాల్సిన గడువు ఈ ఏడాది ఏప్రిల్ తో ముగిసింది. పౌరసరఫరాల శాఖ నిర్దేశించిన గడువులోగా మిల్లర్లు బియ్యం అందించలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏప్రిల్ చివరి నాటికి సీఎంఆర్ పూర్తి చేయాలి. కానీ సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్యం వల్ల కోట్ల విలువ చేసే ప్రభుత్వ సొమ్ముతో మిల్లర్లు అక్రమ దందా నడిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రేషన్ షాపుల ద్వారా సరఫరా చేస్తున్న బియ్యాన్ని కొనుగోలు చేసి వాటిని రైస్ మిల్లులో తిరిగి రా రైస్ గా మార్చి ఎఫ్ సీఐకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఏప్రిల్ వరకు గడువు విధించగా మరో మూడు నెలల్లో పూర్తి స్థాయిలో అందిస్తారని రైస్ మిల్లర్లకు అధికారులు మద్దతు పలకడం పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

యాక్షన్ ప్యాడి మాత్రమే పెండింగ్​

యాక్షన్ లో ఉన్న 69 వేల మెట్రిక్ టన్నుల ప్యాడి మాత్రమే పెండింగ్ లో ఉంది. అది మిల్లర్లకు సంబంధం లేదు. 2023,-24 సీఎంఆర్ రైస్ కు సంబంధించి వారం రోజుల కింద కొనుగోలు పూర్తయినందున 94,356 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రైస్ ఇవ్వాల్సి ఉన్నందున వాటి వివరాలు ఉన్నతాధికారులకు ఇచ్చాం. ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం లేదు, మిల్లర్లకు సహకరించింది లేదు. పెండింగ్​లో ఉన్న రైస్ ను సీఎంఆర్ కు త్వరలో పంపిస్తాం.

కొండల్ రావు, సివిల్​సప్లై డీఎం