ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పకడ్బందీగా చేయాలి

నెట్ వర్క్, వెలుగు: గ్రామాలు, పట్టణాల్లో జరుగుతున్న ఇందిరమ్మ లబ్ధిదారుల సర్వేను శుక్రవారం కలెక్టర్లు, అధికారులు పరిశీలించారు. శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని 1, 4, 11, 20 వార్డుల్లో జరుగుతున్న సర్వేను కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించి స్పీడప్ ​చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు 22 శాతంమాత్రమే సర్వే పూర్తయ్యిందని, మిగతా 78 శాతం సర్వే పూర్తిచేయాల్సి ఉందన్నారు.

సర్వే కోసం వచ్చే సిబ్బందికి, అధికారులకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు. కన్నెపల్లి మండల కేంద్రంలో, జజ్జరవెల్లి, జన్కాపూర్​ గ్రామపంచాయతీల్లో జరుగుతున్న సర్వేను కలెక్టర్ ​దీపక్​పరిశీలించారు. మండలంలో సర్వే ఎందుకు స్లోగా అవుతోందని ఎంపీడీవో శంకర్​ను ప్రశ్నించారు. పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. 

మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని వార్డులు, మండలంలోని అందుగులపేట, శంకర్​పల్లి గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక కోసం చేపట్టిన ఆన్​లైన్ ​ప్రక్రియను స్పెషల్ ఆఫీసర్, జడ్పీ సీఈవో గణపతి తనిఖీ చేశారు. ఆసిఫాబాద్ మండలం రాజంపేట గ్రామపంచాయతీలో కొనసాగుతున్న సర్వేను అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి దరఖాస్తుదారుల వివరాలను ప్రభుత్వానికి అందించాలన్నారు. యాప్​లో 

పొరపాట్లు లేకుండా స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. సర్వేను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు నేరడిగొండ ఎంపీడీవో రాజ్ వీర్ అన్నారు. మండలంలోని తేజాపూర్ గ్రామంలో కొనసాగుతున్న సర్వేను ఆయన పరిశీలించారు. అర్హులైన లబ్ధిదారుల జాబితా సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు.