డైట్ చార్జీల పెంపు కార్యక్రమానికి ఏర్పాట్లు చేయండి

ఆదిలాబాద్, వెలుగు: సంక్షేమ గృహాలు, స్కూళ్ల డైట్, కాస్మొటిక్ చార్జీల పెంపు ప్రారంభ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా మండలాల్లోని సంబంధిత అధికారులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 40 శాతం డైట్, కాస్మొటిక్ చార్జీల పెంపు కార్యక్రమాన్ని ఈ నెల 14 విద్యా సంస్థల్లో ఘనంగా జరుపుకోవాలన్నారు. కార్యక్రమానికి పిల్లల తల్లిదండ్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించాలని సూచించారు. 

అనంతరం జిల్లా ఆహార భద్రత మిషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. జాతీయ ఆహార భద్రత మిషన్ లో జిల్లాకు కేటాయించిన భౌతిక, ఆర్థిక లక్ష్యాలను జిల్లా కమిటీ లో చర్చించి ఆమోదించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలా దేవి, డీఈవో ప్రణీత, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజలింగు, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ సునీత తదితరులు పాల్గొన్నారు. అనంతరం అదిలాబాద్ మండలంలోని చాందా టి, బీంసారి, చిలుకూరి లక్ష్మి నగర్ కాలనీల్లో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను కలెక్టర్ తనిఖీ చేశారు.