ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్య అందించాలి

  • కలెక్టర్ కుమార్ దీపక్

కోటపల్లి, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులతో కూడిన నాణ్యమైన విద్యాబోధన అందించే దిశగా ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్యలు చేట్టిందని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కోటపల్లి మండలం సర్వాయిపేటలోని ప్రభుత్వ స్కూల్​ను ఆకస్మికంగా సందర్శించారు. రిజిస్టర్లు, రికార్డులు, తరగతి గదులు, వంట గదులు, ఆహార సామాగ్రిని పరిశీలించారు.

విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పరీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేస్తూ వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి ప్రభుత్వ విద్యాసంస్థలపై ప్రజల్లో నమ్మకం పెంపొందించాలని టీచర్లకు సూచించారు. విధుల్లో సమయపాలన పాటించాలన్నారు. అనంతరం సర్వాయిపేట, ఎడగట్ట గ్రామాలలో పర్యటించి ఆయా గ్రామాలలో నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. 

గ్రామాల్లో అంతర్గత రహదారులు, మురుగు కాల్వలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, నివాస ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు పాటించాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలన్నారు. కోటపల్లి మండల కేంద్రంలోని కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని 
పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలన్నారు. కలెక్టర్​వెంట ఆయా శాఖల అధికారులున్నారు.