- మంచిర్యాల జిల్లా నెన్నెలలో విషాదం
బెల్లంపల్లి రూరల్, వెలుగు : పెండ్లి అయిన నాలుగు రోజులకే ఓ యువతి కరెంట్ షాక్‌తో చనిపోయింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... నెన్నెలలోని పోచమ్మవాడకు చెందిన పల్ల సిద్దు, జంపి స్వప్న (25) రెండేండ్లుగా ప్రేమించుకున్నారు.
పెద్దలను ఒప్పించి ఈ నెల 4న బెల్లంపల్లి శివాలయంలో పెండ్లి చేసుకున్నారు. స్వప్న ఆదివారం ఉదయం స్విచ్ ఆఫ్ చేయకుండానే వాటర్ హీటర్‌ను పట్టుకుంది. దీంతో షాక్ కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలింది. గమనించిన చుట్టుపక్కల వారు స్వప్నను స్థానిక పీహెచ్‌సీ తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ప్రసాద్ తెలిపారు.