బిడ్డకు జన్మనిచ్చినంక చాలా మంది తల్లులు డిప్రెషన్లోకి పోతారు. ఒక రకమైన భయం ఉంటుంది వాళ్లలో.. దాని నుంచి తేరుకోవడానికి వారాలు పడుతాయి. ఇక తండ్రులు మాత్రం 'నేను నాన్నని అయిన' అంటూ వాట్సప్ పోస్టులు పెడుతారు. ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి పార్టీలు ఇస్తారు. 'కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం తల్లులు సంతోషంగా ఉంటే చాలదు... తండ్రులు కూడా ఆనందంగా ఉండాలి' అని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పినాయి. ఇప్పుడు అట్లాంటిదే ఇంకో నిజం బయటపడింది. ప్రసవం తర్వాత తల్లుల్లాగే కొంతమంది తండ్రులు కూడా డిప్రెషన్లోకి వెళతారట. ఇలాంటి తండ్రులు పది శాతం వరకు ఉంటారని అంచనా.
మొదటిసారి తండ్రి అయిన వాళ్లలో ఇది ఎక్కువట. ఇలాంటి వాళ్లకు ట్రీట్ మెంట్ అవసరమని పరిశోధకులు అంటున్నారు. ఈ ఒత్తిడికి సంబంధించి కొన్ని కారణాలను వాళ్లు విశ్లేషించినారు. ప్రసవం తర్వాత చాలా విషయాల్లో భార్యల సాయం అందకపోవడం, మగపిల్లాడు లేదా ఆడపిల్ల పుట్టాలనే ఎక్స్ పెక్టేషన్స్, భార్య వీక్ గా కనిపించడం, పిల్లలు ఏడ్వటం వల్ల వచ్చే కోపం, నిత్యం బేబీపై ఫోకస్ పెట్టాల్సి రావడం, తమను భార్య నిర్లక్ష్యం చేస్తుందనే భావన వంటివి వీరిలో డిప్రెషన్ కి దారి తీస్తున్నాయి.