ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉంది..అవసరమైతే రాజీనామా:మమతాబెనర్జీ

  • లైవ్ లో చర్చలు జరపాలని డాక్టర్ల పట్టు.. ఒప్పుకోని సర్కార్ 
  • 2 గంటలపాటు వేచి చూసిన సీఎం  

కోల్ కతా: బెంగాల్‌‌ లో డాక్టర్ రేప్, హత్య ఘటనపైనిరసనలు కొనసాగిస్తున్న జూనియర్‌‌ డాక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరగాల్సిన చర్చలపై ప్రతిష్ఠంభన నెలకొంది. గురువారం చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా.. లైవ్ లో చర్చలు నిర్వహించాలని డాక్టర్లు పట్టుపట్టారు. 

దీనికి ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో సందిగ్ధం నెలకొంది. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవసరమైతే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. డాక్టర్లతో సమావేశం కోసం 2 గంటలు ఎదురు చూశానని, అయినా వారి నుంచి స్పందన రాలేదన్నారు. 

నేటితో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశించిన రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. ‘‘చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.  చర్చలను లైవ్ స్ట్రీమింగ్ చేయలేం. సమావేశాన్ని వీడియో రికార్డింగ్‌‌ చేయడానికి ఏర్పాట్లు చేశాం. 

చర్చలు జరిపేందుకు మూడు సార్లు ప్రయత్నించాను. డాక్టర్లు విధులకూ దూరంగా ఉండటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోను. మా ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో అవమానిస్తున్నారు. 

దీని వెనుక రాజకీయ కోణం ఉందని సామాన్యులకు తెలియదు. కొంత మంది బయటి వ్యక్తులు 'చర్చలు చేపట్టొద్దు, సమావేశానికి వెళ్లొద్దు' అని సూచనలు ఇస్తున్నారు” అని మమతా బెనర్జీ చెప్పారు.

లైవ్ స్ట్రీమింగ్ కు అంగీకరించని సర్కార్  

బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బెంగాల్ అంతటా డాక్టర్లు నెల రోజులకు పైగా నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే వారితో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం చర్చలకు రావాలని ఆహ్వానించింది. 33 మంది ప్రతినిధులను అనుమతించాలని, ఈ సమావేశాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేయాలంటూ డాక్టర్లు షరతులు విధించారు. వాటిని తిరస్కరించిన ప్రభుత్వం.. గురువారం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఈ క్రమంలోనే డాక్టర్లు రాష్ట్ర సెక్రటేరియెట్ చేరుకున్నప్పటికీ.. సమావేశానికి హాజరు కాలేదు.