మారనున్న ఏఐసీసీ అడ్రస్ 5 దశాబ్దాల తర్వాత షిఫ్ట్ అవుతున్న పార్టీ ఆఫీసు

  • అక్బర్ రోడ్  నుంచి కోట్లా మార్గ్​లోని బిల్డింగ్​కు చేంజ్
  • ఈనెల 15న ప్రారంభించనున్న సోనియా గాంధీ
  • దేశవ్యాప్తంగా హాజరుకానున్న 400 మంది పార్టీ నేతలు
  • కొత్త ఆఫీసుకు ఇందిరా గాంధీ భవన్​గా పేరు
  • 15 ఏండ్ల పాటు కొనసాగిన నిర్మాణ పనులు

న్యూఢిల్లీ, వెలుగు: ఐదు దశాబ్దాల పాటు అక్కడి నుంచి దేశ రాజకీయాల్ని నడిపించిన కాంగ్రెస్  పార్టీ తన  అడ్రస్ ను మార్చుకోనుంది. కేంద్ర కార్యాలయాన్ని షిఫ్ట్   చేయనుంది. ఆల్  ఇండియా కాంగ్రెస్‌‌‌‌  కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యాలయం అక్బర్‌‌‌‌  రోడ్  నుంచి కోట్లా మార్గ్‌‌‌‌లో నిర్మించిన కొత్త బిల్డింగ్ కు మారనుంది. 9ఏ, కోట్లా రోడ్  వద్ద ఇందిరా గాంధీ భవన్‌‌‌‌  నిర్మాణం పూర్తికావడంతో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు. 

కాంగ్రెస్‌‌‌‌  పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయానికి కొత్త పేరు, కొత్త చిరునామా -9ఏ, కోట్లా రోడ్డులోని ఇందిరా గాంధీ భవన్‌‌‌‌గా నామకరణం చేశారు. ఢిల్లీలోని 24 అక్బర్‌‌‌‌ రోడ్‌‌‌‌ లో ఉన్న ఆఫీస్  నుంచి ఈనెల 15న పార్టీ కార్యాలయం మారనుందని ఆ పార్టీ నేతలు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. కాంగ్రెస్‌‌‌‌  పార్లమెంటరీ పార్టీ చైర్‌‌‌‌ పర్సన్‌‌‌‌ సోనియా గాంధీ ఈనెల 15న ఉదయం 10 గంటలకు పార్టీ  అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌‌‌‌ సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌‌‌‌ గాంధీ సమక్షంలో ఈ ఆఫీసును లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ప్రస్తుతం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంగా సేవలందిస్తున్న 24, అక్బర్‌‌‌‌ రోడ్‌‌‌‌  భవంతి ఢిల్లీలోని పాలనా కేంద్రానికి అత్యంత సమీపంలో ఉంది. ఆ ప్రాంతంలో పాలనా భవనాలతో పాటు- పాలకులు, ఉన్నతాధికారుల నివాస భవనాలు మాత్రమే ఉంటాయి. అదే ప్రాంతంలోని ప్రభుత్వ బంగ్లాలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఉంది. ఇదే మాదిరిగా 11, అశోక రోడ్‌‌‌‌ బంగ్లాను బీజేపీ కొన్ని దశాబ్దాల పాటు- ప్రధాన కార్యాలయంగా మార్చుకుని వినియోగించుకుంది. 

ఆ ప్రాంతంలో రాజకీయ పార్టీల కార్యాలయాలపై సుప్రీంకోర్టు అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ ఇచ్చిన ఆదేశాల తర్వాత దీన్‌‌‌‌  దయాళ్‌‌‌‌  ఉపాధ్యాయ (డీడీయూ) మార్గ్‌‌‌‌లో వివిధ రాజకీయ పార్టీలకు స్థలాలను కేటాయించారు. ఈ క్రమంలో బీజేపీ తమకు కేటాయించిన స్థలంలో అధునాతన సదుపాయాలతో ఓ భవనాన్ని నిర్మించుకుని, పార్టీ కార్యాలయాన్ని 11 అశోక రోడ్‌‌‌‌  నుంచి దీన్‌‌‌‌ దయాళ్‌‌‌‌  ఉపాధ్యాయ మార్గ్‌‌‌‌కు  మార్చుకుంది. అయితే.. బీజేపీ కన్నా చాలా ఏళ్ల క్రితమే కాంగ్రెస్‌‌‌‌  పార్టీ కూడా డీడీయూ మార్గ్‌‌‌‌లో తమకు కేటాయించిన స్థలంలో భవన నిర్మాణం చేపట్టింది. 

2009లో చేపట్టిన నిర్మాణ పనులు 2014 తర్వాత పార్టీ అధికారాన్ని కోల్పోవడంతో నత్తనడకన సాగాయి. ఇప్పుడు పూర్తికావడంతో అక్కడి నుంచి కార్యకలాపాలను కొనసాగించాలని కాంగ్రెస్‌‌‌‌  పార్టీ నిర్ణయించింది. ఏఐసీసీ కేంద్ర కార్యాలయంగా కోట్లా మార్గ్‌‌‌‌లో నిర్మించిన భవనం మారుతుంది.

పెద్దమనసు చాటుకున్న కాకా

దేశంలో కాంగ్రెస్‌‌‌‌  పార్టీ అంటే అక్బర్‌‌‌‌  రోడ్‌‌‌‌  అనేలా రాజకీయాలు నడిచాయి. ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలోని నిర్ణయాలే అమలు చేస్తారనేది జగమెరిగిన వాస్తవం. అధికారంలో ఉన్నప్పుడు ఏ చిన్న నిర్ణయమైనా ప్రస్తుత భవనం కేంద్రంగా నడిచింది. 139 ఏళ్లకు పైగా చరిత్ర కల్గిన కాంగ్రెస్‌‌‌‌  పార్టీ.. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఢిల్లీ నగరాన్ని రాజధానిగా ఎంచుకుంది. అప్పుడు ఢిల్లీలోని జంతర్‌‌‌‌  మంతర్‌‌‌‌  సమీపంలో 7, జంతర్‌‌‌‌  మంతర్‌‌‌‌  భవనాన్ని పార్టీ కార్యాలయంగా మార్చుకుంది. 

1969లో పార్టీలో చీలిక రాగా, ఇందిరా గాంధీ నేతృత్వంలోని పార్టీ తాత్కాలిక భవనాల్లో కొన్నాళ్లు పార్టీ కార్యకలాపాలు నడిపింది. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీని కొనసాగించేందుకు ఇందిరకు పార్టీ ఆఫీసు కూడా లేని పరిస్థితి నెలకొంది. ఈ టైంలో ఆనాడు ఎంపీగా ఉన్న గడ్డం వెంకటస్వామి(కాకా) తనకు అధికారికంగా కేటాయించిన అక్బర్ రోడ్ లోని, 24 నంబర్  బంగ్లాను పెద్ద మనసుతో పార్టీ ఆఫీసు కోసం ఇందిరకు ఇచ్చారు.

 1978లో 24 అక్బర్‌‌‌‌ రోడ్‌‌‌‌  బంగ్లాను పార్టీ ప్రధాన కార్యాలయంగా ఎంచుకుంది. ఈ విషయాన్ని దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్  ముఖర్జీ ‘సంకీర్ణ సంవత్సరాలు’ అనే పుస్తకంలో తెలిపారు. అప్పటి నుంచి ఈ బంగ్లాయే ఏఐసీసీ హెడ్‌‌‌‌క్వార్టర్స్‌‌‌‌గా సేవలందిస్తూ వస్తోంది. 

తెలంగాణ ఏర్పాటు చర్చలు ఈ ఆఫీసులోనే

ఈ బంగ్లాకు ఆనుకుని పక్కనే ఉన్న 10 జన్‌‌‌‌పథ్‌‌‌‌ను సోనియా గాంధీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆమెకు నివాస భవంతిగా కేటాయించగా.. ఇప్పటికీ ఆ భవనంలో సోనియా నివాసం ఉంటున్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో పక్కపక్కనే ఉన్న 10 జన్‌‌‌‌పథ్‌‌‌‌, అక్బర్‌‌‌‌ రోడ్‌‌‌‌ బంగ్లాలు కీలక వ్యవహారాలకు, నిర్ణయాలకు కేంద్ర బిందువులుగా మారాయి. 
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించిన అనేక చర్చలు, నిర్ణయాలకు కూడా ఈ జంట భవనాలే వేదికలయ్యాయి. 

అక్కడి నుంచే దేశ రాజకీయాలు నడిచాయి. దేశ పరిపాలన నిర్ణయాలు సైతం ప్రస్తుత భవనం కేంద్రంగా కొనసాగాయి. పార్టీపరంగానూ, నాడు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ విధానాలపైనా సంచలన నిర్ణయాలు అన్ని ఇక్కడి నుంచే తీసుకున్నారు. ఆ జంట భవనాలు కేంద్రంగా రాజకీయాలు సాగిన తరుణంలో పీవీ నర్సింహారావు, మన్మోహన్‌‌‌‌ సింగ్‌‌‌‌  లాంటి నేతలు ప్రధానిగా సేవలు అందించారు. 

బ్యాక్‌‌‌‌ సైడ్‌‌‌‌ నుంచే మెయిన్‌‌‌‌ ఎంట్రీ

కాంగ్రెస్‌‌‌‌  పార్టీ కొత్త భవనానికి చిరునామా సమస్యగా మారడంతో.. దాని కోసం రూటు మార్చారు. పార్టీ కొత్త ఆఫీస్‌‌‌‌  భవనం నిర్మించింది దీన్‌‌‌‌ దయాళ్‌‌‌‌  ఉపాధ్యాయ మార్గ్‌‌‌‌లోనే కావడంతో దాని చిరునామా కూడా అదే అవుతుంది. అయితే పండిట్‌‌‌‌  దీన్‌‌‌‌  దయాళ్‌‌‌‌  ఉపాధ్యాయ బీజేపీ సిద్ధాంతకర్తల్లో ఒకరు. అలాంటి నేత పేరు మీద ఉన్న అడ్రస్‌‌‌‌లో కార్యాలయం ఉండడాన్ని ఇష్టపడని కాంగ్రెస్  పార్టీ.. వెనుక ద్వారం గుండా రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేసింది. 

ఆ రూట్‌‌‌‌  కోట్లా మార్గ్‌‌‌‌లోకి వస్తుంది. ఫలితంగా అడ్రస్‌‌‌‌  దీన్‌‌‌‌ దయాళ్  మార్గ్‌‌‌‌  కాకుండా కోట్లా మార్గ్‌‌‌‌గా మారుతుంది. వెనుక ద్వారాన్ని ప్రధాన ఎంట్రీగా మార్చడంతో 9ఏ, కోట్లా మార్గ్‌‌‌‌  ఇప్పుడు ఆ బిల్డింగ్‌‌‌‌కి అధికారిక అడ్రస్‌‌‌‌గా మారింది. మొత్తం 6 అంతస్థుల్లో నిర్మించిన ఈ  భవనంలో అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు. ఈనెల 15న ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పార్టీకి చెందిన 400 మంది కీలక నాయకులు హాజరుకానున్నారు.