సమస్యలపై నిలదీత .. గరంగరంగా గద్వాల జడ్పీ సమావేశం

  • మీటింగ్​కు కలెక్టర్​ ఎందుకు రాలేదని నిలదీత
  • మిషన్ భగీరథలో అప్పటి తప్పిదాలు ఇప్పటికీ వెంటాడుతున్నాయని ఆవేదన
  • రైతులపై కాదు.. నకిలీ వ్యాపారులపై కేసులు పెట్టాలని డిమాండ్​
  • స్కూళ్ల పై కప్పులు లీకేజీ అవుతుంటే కరెంట్​ పనులు ఎలా చేస్తున్నారని అసహనం

గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జడ్పీ సర్వసభ్య సమావేశం గరంగరంగా సాగింది. జడ్పీ చైర్​పర్సన్​ సరిత అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశానికి కలెక్టర్​ రాకపోవడంతో సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ముగ్గురు కలెక్టర్లు జిల్లాకు వచ్చి బదిలీపై వెళ్లిపోయారని, అయినా ఏ కలెక్టర్  కూడా మీటింగ్​రాలేదని పేర్కొన్నారు. సమస్యలు చెప్పుకుందామంటే వినేవారు లేరని, కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదని, సదరం సర్టిఫికెట్లకు సైట్లు ఓపెన్  కావడం లేదని, ఇప్పటికీ గ్రామాల్లో మిషన్  భగీరథ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయని, డిజైన్ లోపాలతో చాలా గ్రామాల్లో నీళ్లు రావడం లేదని, స్కూళ్ల పై కప్పులు లీకేజీ అవుతుంటే వాటిని రిపేర్  చేయకుండా ఎలక్ట్రికల్  పనులు చేయడం విడ్డూరంగా ఉందని జడ్పీ చైర్​పర్సన్ తో పాటు సభ్యులు పేర్కొన్నారు. 

మిషన్ భగీరథ పై ముందుగా చర్చ జరిగింది. చైర్​పర్సన్ సరిత మాట్లాడుతూ లత్తిపురం బీసీ కాలనీలో ఏడు రోజులుగా నీళ్లు రావడం లేదని, గట్టు మండల కేంద్రంలోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. గట్టు మండలం తుమ్మలపల్లె, తప్పట్ల, ముచ్చోన్ పల్లిలో నీళ్లు రావడం లేదని ఎంపీపీ విజయ్ కుమార్  ఆఫీసర్ల దృష్టికి తెచ్చారు. ఐజ మండలం రాజాపురం, బైనంపల్లి, భూమిపురం గ్రామాల్లో ఏండ్లు గడుస్తున్నా భగీరథ నీళ్ల సమస్య తీరడం లేదని అక్కడి ఎంపీపీ సభ దృష్టికి తీసుకొచ్చారు. 2015లో డిజైన్ లోపం వల్ల రాజాపురం, బైనంపల్లి, భూమిపురం గ్రామాలకు నీరు రావడం లేదని ఆఫీసర్లు తెలిపారు. జిల్లాకు రూ.6 కోట్ల ఫండ్స్​ రావాల్సి ఉందని, అవి వస్తే లోపాలను సరిచేసి పూర్తి స్థాయి నీళ్లిచ్చే అవకాశం ఉందని ఆఫీసర్లు చెప్పారు. కర్నాటక నుంచి ఒక టీఎంసీ నీళ్లు జూరాలకు చేరిందని ప్రస్తుతం తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.

కలెక్టర్లు ఎందుకు రావట్లే..

జడ్పీ మీటింగ్ లకు కలెక్టర్లు ఎందుకు రావడం లేదని గట్టు ఎంపీపీ విజయ్ కుమార్  సభలో  ప్రస్తావించారు. జిల్లాలోని అన్ని మండలాల ప్రజాప్రతినిధులు పాల్గొనే జడ్పీ మీటింగ్ లో సమస్యలు కలెక్టర్  దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్పారు. జడ్పీ చైర్ పర్సన్  సరిత స్పందిస్తూ కలెక్టర్  సంతోష్  మీటింగ్​కు వస్తానని చెప్పారని, హైదరాబాద్ కు మీటింగ్ కు వెళ్లారని, ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారన్నారు.

డీఈవో నిలదీత..

బడుల్లో పై కప్పు లీకేజ్​ అవుతుంటే, ఆ స్కూళ్లలో ఎలక్ట్రికల్  పనులు చేయించడమేమిటని ఇన్ చార్జి డీఈవో ఇందిరను సభ్యులు ప్రశ్నించారు. ఎవరు ప్రపోజల్స్  పెట్టారని నిలదీశారు. టీచర్లు, హెచ్ఎంలు బడికి సరిగా వెళ్లకపోవడం వల్లే ఎస్సెస్సీ ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా చివరి నుంచి రెండో స్థానంలో నిలిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాదైనా మెరుగైన ఫలితాలు సాధించేలా చూడాలని సూచించారు.

ఉపాధి డబ్బుల కోసం కాళ్లు మొక్కాలా?

మల్దకల్ మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి కూలీ డబ్బుల కోసం కాళ్లు మొక్కాలా? అని డీఆర్డీవో  నర్సింగ్ రావుపై చైర్​పర్సన్  సీరియస్​ అయ్యారు. కాళ్లు మొక్కితేనే ఉపాధి కూలీ డబ్బులు ఇస్తామంటూ కొందరు తెగేసి చెబుతున్నారని, దీనిపై మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. కూలీలను ఇబ్బంది పెడుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. సదరం స్లాట్  బుకింగ్  విషయంలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.

వైద్యం అందట్లేదని ఆవేదన..

హాస్పిటల్ లో వైద్య సేవలు సరిగా అందడం లేదని సభ్యులు వాపోయారు. స్పందించిన డీఎంహెచ్ వో శశికళ, హాస్పిటల్  సూపరింటెండెంట్​ నవీన్  క్రాంతి మాట్లాడుతూ.. స్టాఫ్  లేకపోవడంతో మెషీన్లు ఉన్నా వాడుకోలేని పరిస్థితి ఉందన్నారు. ఫండ్స్  లేకపోవడంతో ఈ పరిస్థితి ఉందని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఇదిలాఉంటే జడ్పీ మీటింగ్ కు ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ, ఎమ్మెల్సీ, కొందరు జడ్పీటీసీలు డుమ్మా కొట్టారు. జడ్పీ సీఈవో కాంతమ్మ, జిల్లా ఆఫీసర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరయ్యారు. 

నకిలీ వ్యాపారులపై  కేసులు పెట్టాలి..

రైతులను దొంగలుగా చూడడం తగదని.. రైతులపై కాకుండా దమ్ముంటే నకిలీ సీడ్  అమ్మే వ్యాపారులపై కేసులు పెట్టాలని కేటిదొడ్డి జడ్పీటీసీ రాజశేఖర్  డిమాండ్​ చేశారు. సీడ్​ కాటన్​ పండించిన రైతులను దొంగలుగా చూడడం తగదన్నారు. రైతులపై కేసులు పెట్టడం లేదని, ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఫెయిల్ సీడ్ పై చర్యలు తీసుకుంటామని డీఏవో గోవింద్​నాయక్​ తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.