డిగ్రీ కూడా చదవకుండానే నెలకు 40 లక్షల రూపాయల శాలరీ తీసుకుంటున్నడు !

చదువంటే పెద్దగా ఇష్టం లేదు. క్లాస్​లో ఎప్పుడూ చివరి బెంచీలోనే కూర్చునేవాడు. అందుకే మోహిత్​ని చదువు మాన్పించి, తెలిసినవాళ్ల దగ్గర పనిలో పెట్టాడు వాళ్ల నాన్న. అలాగైనా బాగుపడతాడు అనుకున్నాడు. కానీ.. అతను కష్టపడి పనిచేసి కంపెనీనే గాడిలో పెట్టాడు. డిగ్రీ కూడా చదవకుండానే నెలకు 40 లక్షల రూపాయల శాలరీ తీసుకునే స్థాయికి ఎదిగాడు. ఆ కంపెనీలో నేర్చుకున్న స్కిల్స్​తోనే ఇప్పుడు యూట్యూబ్​లో వీడియోలు చేస్తున్నాడు. అటు డబ్బుతోపాటు ఇటు లక్షలాదిమంది అభిమానాన్ని సంపాదించుకుంటున్నాడు.

మోహిత్ హర్యానాలోని ఫరీదాబాద్‌లో పుట్టి పెరిగాడు. చదువంటే పెద్దగా ఇంట్రస్ట్​ ఉండేది కాదు. దాంతో ఎప్పుడూ వెనుక బెంచీలోనే కూర్చునేవాడు. కానీ.. తన అన్న మాత్రం బాగా చదివేవాడు. పెద్దోడు బాగా రాణించి.. చిన్నోడు వెనుకబడితే ఎలా ఉంటుంది? వాళ్ల ఫ్యామిలీలో మోహిత్​కు గౌరవమే ఉండేది కాదు. అందరూ అతన్ని తిట్టేవాళ్లే. మోహిత్​ హైస్కూల్​ ఎడ్యుకేషన్​ పూర్తైంది. వాళ్ల అన్న ఇంజనీరింగ్ ఫైనల్​ ఇయర్​ చదువుతున్నాడు. అదే టైంలో వాళ్ల  మామ ఒక సాఫ్ట్​వేర్ కంపెనీ పెట్టాడు. తన కంపెనీలో మోహిత్ అన్నను చేర్చాలని వాళ్ల నాన్నను అడిగాడు. వాళ్ల నాన్న మాత్రం ‘పెద్దోడు బాగా చదువుతాడు. కాబట్టి ఎలాగైనా బతకగలడు.  చిన్నోడిని తీసుకెళ్లి దారిలో పెట్టు. ఈ విధంగానైనా వాడికి జీవితం మీద ఒక క్లారిటీ వస్తుంది’ అని చెప్పాడు. మోహిత్​ గురించి తెలిసిన అతని మామ మాత్రం కాస్త సందేహిస్తూనే ఉద్యోగంలో చేర్చుకున్నాడు. 

సక్సెస్​కు కేరాఫ్​

ఫ్యామిలీలో ఎవరికీ తనమీద నమ్మకం లేదు. కాబట్టి తానేంటో నిరూపించుకోవాలి అనుకున్నాడు మోహిత్. ఉద్యోగంలో చేరిన కొన్ని రోజుల్లోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. అతనికి18 ఏళ్లు వచ్చేనాటికి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలోని క్లయింట్స్​కి 60 వేల డాలర్ల విలువైన యాంటీ–మాల్వేర్ సాఫ్ట్​వేర్​ని అమ్మగలిగాడు.  మోహిత్​ పనికి మెచ్చి అతని మామ తన కంపెనీలో 25 శాతం వాటా ఇచ్చాడు. అంతేకాదు.. అతనికి19 ఏండ్లు వచ్చేనాటికి నెలకు లక్ష రూపాయల శాలరీ వచ్చేది.

అలా కొన్నేండ్లపాటు బాగా పనిచేసి వ్యాపారాన్ని బాగా డెవలప్​ చేశాడు. అతనికి 28 ఏండ్లు వచ్చేనాటికి నెలకు 40 లక్షల రూపాయల శాలరీ తీసుకున్నాడు. కాస్ట్​లీ కార్లు, లగ్జరీ లైఫ్​, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులతో బాగా సెటిల్​ అయ్యాడు. అంతా బాగానే ఉంది అనుకునేలోపే.. బిజినెస్​లో డెవలప్​మెంట్​ ఆగిపోయింది. అప్పుడే వ్యక్తిగత సమస్యలు కూడా అతన్ని  చుట్టుముట్టాయి. వీటన్నింటి నుంచి కాస్త దూరంగా వెళ్తే రిలాక్స్​గా ఉంటుంది అనిపించింది. దాంతో అప్పుడప్పుడు విదేశాలకు వెళ్లి వచ్చేవాడు. 

యూట్యూబ్​లోకి..​​ 

మోహిత్​ రెగ్యులర్​గా ట్రావెలింగ్​ చేస్తుండడంతో తన ఫ్రెండ్స్​ వీసా, హోటల్స్‌, వెళ్లిన చోట చూడాల్సిన ప్రదేశాలు.. లాంటి వాటి మీద ఎలాంటి సందేహాలు ఉన్నా అతన్నే అడిగేవాళ్లు. అవే ప్రశ్నలు అందరూ అడుగుతుంటే.. అవే సమాధానాలు పదే పదే చెప్పాలంటే విసుగొచ్చేది.  అందుకే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. అదే టైంలో 2018 నాటికి వాళ్ల మామ పెట్టిన కంపెనీ మూతపడింది. అతను పెద్దగా చదువుకోలేదు. కాబట్టి బయట అవకాశాలు కూడా దొరకలేదు. ఉద్యోగం చేసినప్పుడు నేర్చుకున్న డబ్బు, కమ్యూనికేషన్​ స్కిల్స్​ మాత్రమే మోహిత్​ దగ్గర ఉన్నాయి. వాటివల్లే అతను ఫుల్​టైం యూట్యూబర్​గా కెరీర్​​ మొదలుపెట్టాడు. 

ALSO READ : కుండలతో స్టార్టప్​ : సంవత్సరానికి 5 కోట్ల బిజినెస్​!

ట్రావెలింగ్​ దేశీ

మోహిత్​ 2018లో ‘ట్రావెలింగ్​ దేశీ’  పేరుతో యూట్యూబ్​ ఛానెల్​ పెట్టాడు. అదే సంవత్సరం పోలాండ్, ఆస్ట్రియాలకు టూర్​కి వెళ్లాడు. అక్కడే తన మేనల్లుళ్లతో కలిసి రోడ్​ ట్రావెల్​ చేశాడు. అక్కడే సుమారు12 రోజులు ఉన్నాడు. అందుకోసం 3 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. ఫోన్​లో చాలా ఫుటేజీ రికార్డ్ చేశాడు. కానీ.. ఎడిటింగ్ చేసేటప్పుడు మోహిత్​కు వీడియో క్వాలిటీగా లేదని అర్థమైంది.

అయినా 5 నిమిషాల నిడివితో తన మొదటి వీడియో అప్​లోడ్​ చేశాడు. కానీ.. దానికి 5 వేల వ్యూస్​ మాత్రమే వచ్చాయి. అందుకే వ్లాగింగ్ కెమెరా, కాస్ట్​లీ ఫోన్ కొన్నాడు. ఆ తర్వాత వీడియో ఎడిటింగ్ స్కిల్స్​ నేర్చుకున్నాడు. అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 

రెండో వీడియోతోనే 

అతని రెండో వీడియోని ‘ఆమ్‌స్టర్‌డామ్–30,000 రూపాయలు’ పేరుతో అప్​లోడ్​ చేశాడు. అందులో ‘ఆమ్​స్టర్​ డామ్​లో 30 వేల రూపాయలతో వారం పాటు ఎలా గడపొచ్చు?’ అనేది చెప్పాడు. దానికి బాగా రీచ్​ వచ్చింది. రెండో వీడియోతోనే సక్సెస్​ అయ్యాడు. కాకపోతే.. ఆ వీడియో కోసం మోహిత్​ చాలా కష్టపడ్డాడు. ఏడు రోజుల్లో 3 వేల క్లిప్‌లు షూట్​ చేశాడు. వీడియోను ఎడిట్ చేయడానికి దాదాపు 80 గంటల టైం పట్టింది. దాని రన్నింగ్ టైమ్ 8 నిమిషాలు మాత్రమే. 

ఖర్చులే ఎక్కువ

మొదట్లో వీడియోల వల్ల మోహిత్​కు వచ్చే డబ్బు కంటే అతను ఖర్చు చేసిందే చాలా ఎక్కువ. మొదటి రెండు నెలలు అసలు డబ్బులే రాలేదు. కానీ.. లక్షల్లో ఖర్చయ్యింది. ఆ తర్వాత స్విట్జర్లాండ్‌లో చేసిన సిరీస్​తో ఛానెల్​ బాగా ఫేమస్​ అయ్యింది. ఈ ట్రిప్​లో  స్విట్జర్లాండ్​లోని సిటీల గుండా కారులో ట్రావెల్​ చేశాడు. అక్కడి అందమైన నగరాలు, ప్రజల సంస్కృతి, ఆహార అలవాట్లు లాంటివన్నీ కవర్​ చేశాడు. తర్వాత కరోనా వచ్చింది. ఆ టైంలో ట్రావెలింగ్​కు బదులు వ్లాగింగ్​ చేశాడు. ఇప్పటివరకు ఛానెల్​లో మొత్తం 1,341 వీడియోలు అప్​లోడ్ చేశాడు. ఛానెల్​కు 3.3 మిలియన్ల సబ్​స్క్రయిబర్స్​ ఉన్నారు.