యూట్యూబర్ ​: తిరుగుతున్నడు.. తింటున్నడు.. సంపాదిస్తున్నడు!

నచ్చింది తినడంలో ఉండే ఆనందం కంటే.. రోజుకో వెరైటీ ఫుడ్‌‌‌‌ తినడంలో ఉండే కిక్కే వేరు అంటుంటారు కొందరు. ఆ కిక్కు కోసమే ప్రపంచదేశాలు తిరుగుతూ.. రకరకాల వంటకాలు రుచి చూస్తున్నాడు మార్క్ వీన్స్‌‌. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలురకాల స్ట్రీట్‌‌ ఫుడ్స్‌‌, సంప్రదాయ వంటకాల గురించి అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో ఫుడ్ వ్లాగ్స్ చేస్తూ.. ఆ వీడియోలను యూట్యూబ్‌‌లో అప్‌‌లోడ్‌‌ చేస్తున్నాడు. ఈ మధ్యే ఇండియా వచ్చిన మార్క్​ మన వంటకాలను ప్రపంచానికి చూపిస్తున్నాడు. 

కాలేజీలో గ్రాడ్యుయేషన్​ పూర్తి చేసిన వెంటనే మార్క్ వీన్స్ ప్రపంచమంతా చుట్టేయాలి అనుకున్నాడు. వెంటనే ఆ జర్నీ మొదలుపెట్టి పదేండ్లలో చైనా, మెక్సికో, లావోస్, టర్కీ, దుబాయి, ఆస్ట్రియాతోపాటు ఇంకా ఎన్నో  దేశాలు తిరిగాడు. జాకుజీ చికెన్, ఫిష్ చిల్లీ డిప్, ఓక్సాకన్ మోల్ నీగ్రో లాంటి వింత వంటకాలను ప్రపంచానికి పరిచయం చేశాడు. 

యూట్యూబ్‌‌లోకి..

మార్క్​ అమెరికాలో పుట్టి, పెరిగాడు. కానీ.. ఇప్పుడు బ్యాంకాక్‌‌లో సెటిల్‌‌ అయ్యాడు. అరిజోనా స్టేట్ యూనివర్సిటీ నుంచి గ్లోబల్‌‌ స్టడీస్‌‌లో ‘కల్చర్‌‌‌‌ అండ్‌‌ ఆర్ట్‌‌’ డిగ్రీ పొందాడు. ఇతనికి కొత్త కల్చర్స్‌‌ గురించి తెలుసుకోవడం, ట్రావెల్‌‌ చేయడం అంటే ఇష్టం. అందుకే గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే 2008లో వరల్డ్​ టూర్​ చేసేందుకు బయల్దేరాడు. కానీ.. ఒక ఏడాది ట్రావెల్‌‌ చేయగానే తన దగ్గరున్న డబ్బు చాలావరకు అయిపోయింది. ఎలాగోలా డబ్బు సంపాదించి మళ్లీ ట్రావెలింగ్ మొదలుపెట్టాలి అనుకున్నాడు. అందుకే దక్షిణ అమెరికాలో ఒక ఏడాది ఇంగ్లిష్‌‌ టీచింగ్‌‌ చేశాడు.

అప్పుడే అతను అదనపు ఆదాయం కోసం బ్లాగింగ్‌‌ చేయడం మొదలుపెట్టాడు. రోజూ తను తినే ఫుడ్‌‌ ఫొటోలు తీసి, దాని గురించి క్లుప్తంగా రాస్తూ.. బ్లాగ్స్ పోస్ట్ చేసేవాడు. అలా చేస్తున్నప్పుడే వీడియోల ద్వారా ఇంకా ఎక్కువ రీచ్ వస్తుంది అనిపించింది. ఫొటోలో ఫుడ్ మాత్రమే చూడగలం. కానీ.. అది తిన్నప్పుడు కలిగే ఫీలింగ్‌‌ని చూడలేం. వీడియోలో అయితే.. వండే విధానం కూడా చూపించొచ్చు అనుకున్నాడు.

వెంటనే తాను తినే ఫుడ్ వండినప్పుడు, తింటున్నప్పుడు చిన్న చిన్న వీడియోలు తీసి యూట్యూబ్‌‌లో అప్‌‌లోడ్‌‌ చేయడం మొదలుపెట్టాడు. కానీ మొదట్లో పెద్దగా డబ్బు రాలేదు. అతనికి సరిపడా డబ్బు రావడానికి కొన్నేండ్లు పట్టింది. ఆ తర్వాత టూర్‌‌‌‌లో భాగంగా థాయిలాండ్ వెళ్లాడు. అమెరికాతో పోలిస్తే.. అక్కడ తక్కువ బడ్జెట్‌‌తో బతికేయొచ్చు. అందుకే ఖాళీ దొరికినప్పుడల్లా థాయిలాండ్‌‌లోనే ఉంటున్నాడు. 

అంత సక్సెస్‌‌ లేదు

మార్క్​ 2009లోనే యూట్యూబ్‌‌లో ‘‘మార్క్‌‌ వీన్స్‌‌” పేరుతో ఛానెల్‌‌ పెట్టాడు. కానీ..  అప్పట్లో ఇంటర్నెట్ వాడకం తక్కువ. కాబట్టి  తన వీడియోలకు చాలా తక్కువ వ్యూస్ వచ్చేవి. పైగా అప్పట్లో వీన్స్ దగ్గర వీడియోలు తీసేందుకు కావాల్సిన ఎక్విప్‌‌మెంట్ కూడా సరిగ్గా ఉండేదికాదు. అందుకే చాలా రోజుల వరకు వ్యూస్‌‌ రాలేదు. అతను మొదట్లో అప్‌‌లోడ్‌‌ చేసిన చాలా వీడియోలకు ఇప్పటికీ లక్ష వ్యూస్‌‌ దాటలేదు. మార్క్​ ఛానెల్ పెట్టిన కొన్నాళ్లకు ఇంటర్నెట్ సర్వీసులు అందరికీ అందాయి. వీడియోలకు జనాదరణ పెరిగింది.

దాంతో రెగ్యులర్‌‌‌‌గా వీడియోలు పోస్ట్​ చేయడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్‌‌ వీడియోలు ఎక్కువగా అప్‌‌లోడ్‌‌ చేశాడు. వ్యూస్‌‌తోపాటు సబ్‌‌స్క్రయిబర్స్ సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. మొదట్లో చిన్న వీడియోలు పోస్ట్‌‌ చేసే వీన్స్ పెద్ద వ్లాగ్స్ పోస్ట్‌‌ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఆయన ఛానెల్‌‌కు10.5 మిలియన్ల సబ్‌‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఇప్పటివరకు 1400కు పైగా వీడియోలు అప్‌‌లోడ్‌‌ చేశాడు.

ఇప్పుడు పోస్ట్​ చేస్తున్న ప్రతి వీడియోకు మిలియన్లలో వ్యూస్‌‌ ఉంటున్నాయి. మార్క్​ తన మెయిన్ ఛానెల్‌‌తోపాటు మరో రెండు ఛానెల్స్‌‌ కూడా నడుపుతున్నాడు. వాటిలో ‘మార్క్‌‌ అబ్రాడ్‌‌’ ఛానెల్‌‌ను 8లక్షల 76 వేల మంది సబ్‌‌స్క్రయిబ్‌‌ చేసుకున్నారు. ‘బిగ్‌‌ ఆన్‌‌ స్పైస్‌‌ – మార్క్‌‌ వీన్స్‌‌’ ఛానెల్‌‌కు 2 లక్షల 13 వేలమంది సబ్‌‌స్క్రయిబర్స్‌‌ ఉన్నారు.  

ఆసక్తి ఎందుకు? 

చిన్నప్పుడే మార్క్​ దేశదేశాలు తిరిగాడు. అందుకే అతనికి ట్రావెలింగ్‌‌, కల్చర్స్ తెలుసుకోవడం పట్ల ఇష్టం పెరిగింది. అతని తల్లిదండ్రులు అమెరికన్స్​ అయినా.. మార్క్​ హైస్కూల్ చదువు పూర్తయ్యేవరకు ఫ్రాన్స్‌‌, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, కెన్యాలో ఉన్నారు. అలా చిన్నప్పుడే రకరకాల కల్చర్స్‌‌ చూశాడు. అందుకే అన్ని దేశాలు తిరిగి అక్కడి సంస్కృతులు తెలుసుకోవాలనే ఆసక్తి మొదలైంది. కెన్యాలోని నైరోబీలో ఉన్నప్పుడు మార్క్​ ఇంటర్నేషనల్‌‌ స్కూల్‌‌లో చదివాడు. ఆ స్కూల్‌‌లో ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన స్టూడెంట్స్ ఉండేవాళ్లు. వాళ్లంతా కొరియన్, ఇథియోపియన్, చిలీ..దేశాలకు చెందిన వాళ్లు. రకరకాల ఫుడ్‌‌ తీసుకొచ్చేవాళ్లు. దానివల్ల వివిధ దేశాల ఫుడ్‌‌ గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ కలిగింది మార్క్​కి.