యూట్యూబర్​: మధురా బచల్ మధురమైన రుచులు

సక్సెస్​కు ఫుల్​స్టాప్​లు ఉండవు. కామాలు మాత్రమే ఉంటాయి” అని పాపులర్​ తెలుగు సినిమా డైలాగ్ ఒకటి ఉంది. ఈమె జీవితంలో కూడా అంతే. ఎన్నో సక్సెస్​లు ఫుల్​స్టాప్​ లేకుండా వస్తూనే ఉన్నాయి. అందుకు కారణం ఆమెలోని పట్టుదల. ఎలాగైనా సక్సెస్​ కావాలనే బలమైన కోరిక. అందుకే చదువు అయిపోగానే మంచి జాబ్​ సంపాదించింది. తర్వాత పెండ్లి చేసుకుని ఇక్కడ అన్నీ వదులుకుని అమెరికా వెళ్లిపోయింది. 

అక్కడ కూడా బ్యాంక్​ జాబ్​ తెచ్చుకుంది. కూతురు పుట్టాక ఆ ఉద్యోగానికి ‘బై బై’ చెప్పింది. ఉద్యోగం చేయట్లేదని ఖాళీగా ఉండడానికి ఇష్టపడలేదు. యూట్యూబ్​ ఛానెల్​ స్టార్ట్​ చేసింది. అందులోనూ సక్సెస్​ అయ్యింది. అంతటితో ఆమె జర్నీ ఆగలేదు.  ఇప్పుడు బిజినెస్​లోకి అడుగుపెట్టింది. సక్సెస్​ జర్నీలో దూసుకుపోతున్న మధురా బచల్ మాటల్లోనే ఆమె సక్సెస్​ జర్నీ గురించి..​.  

జీవితం ఏది ఇచ్చినా స్వాగతించాలి. తియ్యని పండ్లకు బదులు నిమ్మకాయలు ఇస్తే..  నిమ్మరసం చేసుకుని తాగాలి. కానీ.. బాధపడకూడదు’’ అని చెప్తుంటారు పెద్దలు. కానీ.. ఆ నిమ్మకాయలతో నిమ్మరసమే ఎందుకు చేసుకోవాలి? పచ్చడి, లెమన్ రైస్, లెమన్ మఫిన్‌.. ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు కదా అనుకుంటా. అలా ఆలోచించడం వల్లే ఇప్పుడు యూట్యూబ్​ చెఫ్​, బిజినెస్​ విమెన్​​గా పేరు తెచ్చుకున్నా. మాది మహారాష్ట్ర. పుట్టింది, పెరిగింది అక్కడే. నా చిన్నప్పుడు డబ్బుపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. చదువుకునే రోజుల నుంచే నా అవసరాలు తీర్చుకోవడానికి చిన్న చిన్న పనులు చేయడం మొదలుపెట్టా.

 నా జీవితమంతా కాలేజీ, జాబ్​, ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఫ్రీలాన్స్ అవకాశాల చుట్టూరా తిరిగింది. కాలేజీ చదువు పూర్తయ్యాక ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్లేదాన్ని. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అక్కడే పని. సాయంత్రాలు ఖాళీగా ఉండకుండా మెహందీ, రంగోలీ డిజైనింగ్ లాంటి పనులు చేశా. అలా ఎనిమిదేండ్ల ఉద్యోగ జీవితంలో చివరికి కార్పొరేట్ జాబ్​ తెచ్చుకున్నా. పెండ్లి వయసు వచ్చేనాటికి మంచి జీతం వచ్చే ఉద్యోగంలోనే ఉన్నా. ఆర్థిక స్వాతంత్రం వచ్చేసింది. నాకు వచ్చే జీతం నా ఫ్యామిలీ మొత్తానికి సరిపోయేది. 

పెండ్లి తర్వాత

జీవితంలో సెటిల్​ అయ్యాక 2006 లో మంగేష్‌తో పెళ్లి జరిగింది. కానీ.. మంగేష్​కు 2007లో అమెరికాలో ఉద్యోగం​ వచ్చింది. అలా చికాగో సిటీకి వెళ్లాం. అక్కడ కూడా నాలోని పని రాక్షసి ఖాళీగా ఉండలేకపోయింది. అందుకే పేరున్న ఒక బ్యాంకులో ఉద్యోగం తెచ్చుకున్నా. మళ్లీ నా జీవితంలో 9–6  డైలీ రొటీన్​ మొదలైంది. అక్కడికి వెళ్లాక కొత్త ఇల్లు, కొత్త జీవితం, కొత్త ఉద్యోగం..  అలాగే కొత్తగా వంట చేయడం కూడా అలవాటు చేసుకున్నా. 

బోలెడు ఎక్స్​పరిమెంట్స్​

పెండ్లికి ముందు వంట చేసేదాన్ని కాదు. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తుండటం వల్ల వంట చేసే టైం ఉండేది కాదు. కానీ.. పెండ్లయ్యాక వంట చేయక తప్పలేదు. అందుకు కుకింగ్​ స్కిల్స్​ని ఇంప్రూవ్​ చేసుకునేందుకు ట్రయల్ అండ్​ ఎర్రర్‌ పద్ధతిలో వంటలు చేసి మరీ నేర్చుకున్నా. ముఖ్యంగా మరాఠీ వంటకాలపై ఇంట్రెస్ట్​ ఎక్కువ ఉండేది. ఖాళీ టైం దొరికినప్పుడల్లా కొత్త రుచుల కోసం ప్రయోగాలు చేశా. 2008లో ప్రెగ్నెంట్​ అయ్యా. అయినా ఉద్యోగానికి సెలవు పెట్టకుండా నా కూతురు పుట్టేవరకు ఆఫీస్​కు వెళ్లా. చివరి రోజు వరకు..  అంటే 9 నెలల 9 రోజులు పనిచేశా. ఆఖరికి చలికాలంలో కూడా వర్క్​ చేశా. 

డిజిటల్ ప్రపంచంలోకి...

పాప పుట్టాక తల్లిగా బాధ్యత రావడంతో ఉద్యోగానికి రాజీనామా చేయాలి అనుకున్నా. నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఇంట్లో ఉంటూనే ఇంకా ఏదైనా పనిచేయొచ్చనే ఆలోచన వచ్చింది. వెంటనే బ్లాగింగ్​ మొదలుపెట్టా. ఆ తర్వాత యూట్యూబ్​ ఛానెల్​ పెట్టాలి అనుకున్నా. అప్పుడే నాలోని హోం చెఫ్... కుకింగ్​ వీడియోలు చేయమని ప్రోత్సహించింది. 

మొదట్లో ఎలాంటి వంటకాలు చేయాలనే కన్ఫ్యూజన్​ ఉండేది. అందుకే యూట్యూబ్​లో చాలా వీడియోలు చూశా. అప్పటికే దక్షిణాది, పంజాబి, గుజరాతి వంటకాల దగ్గర్నించీ చైనీస్, ఫ్రెంచ్, మెక్సికన్ వరకు ఎన్నో రకాల వంటకాల వీడియోలు యూట్యూబ్​లో ఉన్నాయి. కానీ.. మరాఠీ వంటకాల వీడియోలు ఎక్కువగా కనిపించలేదు. పైగా నాకు కూడా ఆ వంటకాలు చేయడమంటేనే ఇష్టం. అందుకే మరాఠా ఫుడ్​ని అందరికీ పరిచయం చేయాలని 2009 డిసెంబర్​లో ‘మధురాస్​ రెసిపీ’ పేరుతో ఛానెల్​ మొదలుపెట్టా. 

మధురాస్​ రెసిపీ 

మొదట్లో ఇంట్లో వాడే వస్తువులనే వీడియోలు షూటింగ్​ చేసేందుకు వాడేవాళ్లం. లైటింగ్ కోసం టేబుల్ ల్యాంప్స్​ వాడాం అప్పుడు. 2010లో యూట్యూబ్  వీడియోలకు అంత క్రేజ్​ ఉండేది కాదు. ఇండియాలో యూబ్యూబ్​ అంత పాపులర్​ కూడా కాదు. దాంతో ఇండియా నుంచి నా వీడియోలకు అంత వ్యూయర్​షిప్​ ఉండేది కాదు. కానీ.. అమెరికా, మెక్సికో, ఫ్రాన్స్​తో పాటు చాలా దేశాల వాళ్లు చూసేవాళ్లు. ప్రపంచం నలుమూలల నుంచి వంట వీడియోలకు కామెంట్లు వచ్చేవి. 

ఇండియాకు రిటర్న్​

ఛానెల్​కు బాగానే రీచ్​ వచ్చింది. కొన్ని రోజుల్లోనే  లక్షమంది సబ్​స్క్రయిబర్ల మార్క్​ని రీచ్​ అయ్యా. సిల్వర్​ బటన్‌ కూడా వచ్చింది. మూడేండ్ల తర్వాత యూట్యూబ్ నుంచి డబ్బులు రావడం మొదలైంది. అలా కొన్నేండ్లు గడిచాక 2013లో ఇండియాకు వచ్చేశాం. అప్పటికే ఇంగ్లీషులో చాలా వీడియోలు చేశా. రెస్పాన్స్​ కూడా చాలా బాగుంది. అయినా.. మాతృభాషలో వీడియోలు చేయాలి అనిపించింది. అందుకే 2016లో ‘మధురాస్​ రెసిపీ మరాఠీ’ పేరుతో మరో ఛానెల్​ పెట్టా. ఈ ఛానెల్ కేవలం18 నెలల్లో1 మిలియన్ సబ్‌స్క్రయిబర్ల మార్క్​కి చేరింది. నాలుగేండ్లు నిండకముందే నాలుగు మిలియన్ల మంది సబ్​స్క్రయిబ్​ చేసుకున్నారు. నాలుగు మిలియన్ల సబ్‌స్క్రయిబర్ల మార్క్‌ దాటిన మొదటి మరాఠీ యూట్యూబ్ ఛానెల్ నాదే! 

బిజినెస్​లోకి.. 

యూట్యూబ్​లో తొమ్మిదేండ్లకు పైగా కష్టపడి పనిచేసి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న తర్వాత బిజినెస్​ మొదలుపెట్టా. మరాఠీ వంటకాలకు, నా వ్యూయర్స్​కు మధ్య గ్యాప్​ని తగ్గించేందుకు కొన్ని ఫుడ్​ ప్రొడక్ట్స్​ని మార్కెట్‌లోకి తెచ్చా. ఫుడ్​ ప్రొడక్ట్స్​ ఎందుకంటే మరాఠీ వంటకాల్లో వాడే కొన్ని మసాలాలు అన్ని  చోట్ల దొరకవు. కాబట్టి వాటిని దేశంలో ఎక్కడికైనా డెలివరీ చేసేందుకు ‘మధుర రెసిపీ’ బ్రాండ్​ పేరుతో తెచ్చా. ఎక్కువగా మరాఠీ వంటకాలకు అవసరమయ్యే ఇంగ్రెడియెంట్స్​, మసాలాలు మాత్రమే అమ్ముతున్నాం” అంటూ చెప్పింది మధుర. 

అదే స్పెషల్​ 

యూట్యూబ్​లో కుకింగ్​ వీడియోల కోసం వెతికితే కొన్ని వందల ఛానెళ్లు కనిపిస్తుంటాయి. అయినప్పటికీ  మధుర చేసే వీడియోలను ఎక్కువమంది చూడడం వెనక ఒక కారణం ఉంది. అదేంటంటే... వంటల్లో వాడే ఇంగ్రెడియెంట్స్​, వంటకం తయారీ గురించి చెప్పే విధానం. ఇండ్లలో దొరికే ఇంగ్రెడియెంట్స్​తోనే రుచికరమైన ఫుడ్​ తయారుచేయడం గురించి చెప్తుంది. వీడియోలో ప్రతి విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్తుంది. మరాఠీ భాష రాని వాళ్ల కోసం వీడియో డిస్క్రిప్షన్​లో ఇంగ్లిష్​లో ఇంగ్రెడియెంట్స్​ లిస్ట్, తయారీ విధానం రాస్తుంది. అందుకే మరాఠీ భాష తెలియని వాళ్లు కూడా ఆమె వీడియోలు చూస్తుంటారు. 

నాలుగు ఛానెళ్లు

ఇప్పటివరకు ‘మధురాస్​ రెసిపీ మరాఠీ’ ఛానెల్​లో 1800 వీడియోలు అప్​లోడ్​ చేశారు. అందులో ఉన్న వంటకాలు ఎక్కువగా మహారాష్ట్రకు చెందినవే. ప్రస్తుతం ఈ ఛానెల్​కు7.7 మిలియన్ల మంది సబ్​స్క్రయిబర్లు ఉన్నారు. ఛానెల్​లో 5 మిలియన్ల వ్యూస్​ దాటిన వీడియోలు చాలానే ఉన్నాయి. ‘మిసల్​ పావ్​’ వీడియో 22 మిలియన్ల వ్యూస్​తో మొదటి స్థానంలో ఉంది. ఈ ఛానెల్​తోపాటు మరో 3 ఛానెళ్లు కూడా నడుపుతోంది. 

వాటిలో ‘మధురాస్​ రెసిపీ హిందీ’ ఛానెల్​కు1.36 మిలియన్ల సబ్​స్క్రయిబర్లు ఉన్నారు. ఈ ఛానెల్​లో ఇప్పటివరకు 954 వీడియోలు అప్​లోడ్​ చేశారు. కానీ.. ఈ ఛానెల్​లో ఏడాది నుంచి వీడియోలు అప్​లోడ్​ చేయడం లేదు. ‘మధురాస్​ రెసిపీ ఫుడీ’ అనే మరో ఛానెల్​కు లక్షా 77 వేల మంది సబ్​స్క్రయిబర్లు ఉన్నారు. ఇందులో170 వీడియోలు ఉన్నాయి. ఇందులో మాత్రం రెగ్యులర్​గా వీడియోలు అప్​లోడ్​ చేస్తున్నారు. మధుర ‘మధురాస్​ రెసిపీ’ అనే ఛానెల్​ కూడా నడుపుతోంది. ఈ ఛానెల్​లో 98 వీడియోలు ఉన్నాయి. లక్షా 54 వేల మంది సబ్​స్క్రయిబ్​ అయ్యారు. 

కరుణాకర్ మానెగాళ్ల