వయసు పదేండ్లు. కానీ.. ఆమెకు ప్రపంచం నలుమూలల నుంచి ఫాలోవర్స్ ఉన్నారు. అలాగని హాలీవుడ్ యాక్టర్ కూతురో, స్పోర్ట్స్ పర్సన్ ఇంట పుట్టిన అమ్మాయో కాదు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి... యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయ్యింది.
అనస్తేషియా రాడ్జిన్స్కయా జనవరి 27, 2014న రష్యాలోని క్రాస్నోడార్‌లో పుట్టింది. ఆమె యూట్యూబ్ ఛానెల్ పేరు ‘లైక్ నాస్త్య’ కావడంతో అందరూ ‘నాస్త్య’ అని పిలుస్తుంటారు. ఆమెకు ఇప్పుడు పదేండ్లు. తల్లిదండ్రులు... సెర్గీ, అన్నా రాడ్జిన్స్కయా. సెర్గీ 20 మంది ఉద్యోగులతో ఒక ప్రొడక్షన్ కంపెనీ నడిపేవాడు. అన్నా సెలూన్ నడిపేది. అయితే నాస్త్య యూట్యూబ్ ఛానెల్‌కు మిలియన్ల మంది సబ్‌స్క్రయిబర్లు రావడంతో తల్లిదండ్రులిద్దరూ ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్ కోసమే పనిచేస్తున్నారు.
మాట్లాడలేదా!
నాస్త్య పుట్టినప్పుడు క్రాస్నోడార్‌లోని డాక్టర్లు ఆమెకు ‘సెరిబ్రల్ పాల్సీ ఉంది. జీవితంలో ఎప్పటికీ మాట్లాడలేద’ని చెప్పారు. కానీ, సెర్గీ, అన్నాలు మాత్రం ‘మా అమ్మాయి మాట్లాడగలుగుతుంది’ అనే నమ్మకంతోనే ఉన్నారు. చిన్నప్పటినుంచి నాస్త్యకు మాటలు నేర్పించేందుకు ట్రై చేశారు. ఆమె రెండో పుట్టినరోజుకు ముందునుంచి చిన్న చిన్న పదాలు పలకడం మొదలుపెట్టింది. అది చూసిన నాస్త్య అమ్మానాన్నలు చాలా సంతోషించారు. కూతురు మాటలను వీడియో తీసి.. డాక్టర్లు, వాళ్ల బంధువులకు పంపారు.
మొదటి వీడియోను ‘లైక్ నాస్త్య’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ పెట్టి కూతురి రెండో పుట్టినరోజుకు రెండు రోజుల ముందు అంటే... జనవరి 25, 2016న పోస్ట్ చేశారు. వాళ్ల అమ్మాయి మాట్లాడుతుందనే విషయాన్ని చెప్పేందుకు అలా చేశారే కానీ ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని వాళ్లు ఊహించలేదు. ఆమె మొదటి వీడియోకు దేశ విదేశాల నుంచి వ్యూస్ వచ్చాయి. అలా నాస్త్య వీడియోలకు మంచి రెస్పాన్స్ రావడం మొదలైంది.
కొన్ని రోజుల్లోనే సక్సెస్
నాస్త్య వీడియోలకు రెస్పాన్స్ వస్తుండడంతో రెగ్యులర్‌గా వీడియోలు తీసి, యూట్యూబ్‌లో పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. వ్యూస్ పెరిగేకొద్దీ డబ్బులు రావడం మొదలైంది. దాంతో ఈవెంట్ ప్లానర్‌గా అనుభవం ఉన్న అన్నా వీడియోల కోసం స్క్రిప్ట్‌లు రాయడం, షూటింగ్ చేయడం మొదలుపెట్టింది. నాస్త్య బొమ్మలతో ఆడుకోవడం, ప్లేగ్రౌండ్‌లో అల్లరి చేసే వీడియోలు యూట్యూబ్‌లో పెట్టేది. తర్వాత బొమ్మలను అన్‌బాక్స్ చేసే వీడియోలు పెట్టింది.
వాటికీ విపరీతమైన వ్యూస్ వచ్చాయి. ఆ వీడియోలకు సౌండ్ ఎఫెక్ట్స్, జంప్ కట్స్, స్లాప్‌స్టిక్ కామెడీ లాంటివి కూడా కలిపేది. దాంతో ప్రపంచం దృష్టిని నాస్త్య వీడియోలు ఆకర్షించడం మొదలైంది. 2017లో ఈ కుటుంబం ఆగ్నేయాసియా ట్రిప్‌కు వెళ్లింది. ఆ టూర్‌లో భాగంగా వాళ్లు కొన్ని ప్రాంతాలకు వెళ్లారు. అక్కడి జనాలు వాళ్లను గుర్తుపట్టారు. ముఖ్యంగా ఎక్కువమంది చిన్న పిల్లలు నాస్త్యని గుర్తుపట్టారు.
వేరే భాషల్లోకి డబ్బింగ్
నాస్త్య తల్లిదండ్రులు ఛానెల్‌ని మరింత డెవలప్ చేయాలనే ఉద్దేశంతో లాస్ ఏంజెలెస్‌లో ఉన్న యూట్యూబ్ మల్టీఛానెల్ నెట్‌వర్క్ ‘బామెల్’తో జత కలిశారు. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యూయర్స్‌ని ఆకర్షించేందుకు హిందీ, కొరియన్, స్పానిష్, అరబిక్, ఫ్రెంచ్, జర్మన్‌తోపాటు మరికొన్ని భాషల్లో వీడియోలను డబ్ చేస్తున్నారు. అందుకోసం మెయిన్ ఛానెల్‌తో పాటు మరికొన్ని ఛానెల్స్ కూడా నడుపుతున్నారు.
డబ్ చేయడం మొదలుపెట్టిన నాలుగు నెలల్లోనే వ్యూయర్‌షిప్ రెట్టింపు అయ్యింది. యూట్యూబ్ నుంచి కూడా డబ్బు బాగా వచ్చింది. ఇప్పుడు వాళ్ల యూట్యూబ్ ఛానెల్‌ను నడిపేందుకు దాదాపు 20 మందిని నియమించుకున్నారు. కొందరు ట్రాన్స్‌లేటర్లు నాస్త్య ఛానెల్ కోసం పనిచేస్తున్నారు.
వారానికి రెండు రోజులు
ఇప్పుడు నాస్త్య ఎలిమెంటరీ స్కూల్‌లో చదువుకుంటోంది. వారానికి ఐదు రోజులు స్కూల్‌కు వెళ్తుంది. మిగతా రెండు రోజులు షూటింగ్ చేస్తుంది. ఖాళీ టైంలో మాండరిన్, స్పానిష్ భాషలు నేర్చుకుంటుంది. పాటలు పాడటం, యాక్టింగ్, డాన్స్ క్లాస్‌లకు కూడా వెళ్తోంది. ఇంత బిజీగా ఉన్నా వారానికి రెండు వీడియోలను అప్‌లోడ్ చేయడం మాత్రం మానట్లేదు. ఫ్యూచర్ కోసం కూతురి సంపాదనలో ఎక్కువ భాగాన్ని ఆమె పేరిటే డిపాజిట్ చేస్తున్నారు నాస్త్య తల్లిదండ్రులు.
మిలియన్లలో...
మెయిన్ ఛానెల్ ‘‘లైక్ నాస్త్య’’కు 112 మిలియన్ల మంది సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఆ ఛానెల్‌లో ఇప్పటివరకు 864 వీడియోలు అప్‌లోడ్ చేశారు. ఛానెల్‌లోని ఒక వీడియోకు ఏకంగా 943 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 800 మిలియన్ల వ్యూస్ దాటిన వీడియోలు కూడా చాలానే ఉన్నాయి. ఈ ఛానెల్‌తో పాటు మరో 11 ఛానెల్స్ నడుపుతున్నారు. వాటిలో ఒక ఛానెల్ మినహాయిస్తే.. అన్నిటికీ సబ్‌స్క్రయిబర్స్ మిలియన్స్‌లోనే ఉన్నారు. లైక్ నాస్త్య షో ఛానెల్‌కు 42.9, లైక్ నాస్త్య ఈఎస్పీకి 39.5 మిలియన్ల మంది సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు.
2019వ సంవత్సరానికి గాను యూట్యూబ్ ద్వారా అత్యధికంగా డబ్బు సంపాదించిన వాళ్ల లిస్ట్‌లో ప్రపంచంలో మూడో స్థానం.ఏడాదికి 18 మిలియన్ల అమెరికన్ డాలర్లకు పైగా సంపాదిస్తోంది అనస్తేషియా.