పుట్టింది న్యూజిలాండ్‌లో అయినా.. ఇండియా అంటే అమితమైన ఇష్టం. అందుకే ఎక్కువగా ఇండియాలోనే ఉంటున్నాడు. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయం, పరిస్థితులు, అందాలను యూట్యూబ్ ద్వారా అందరికీ పంచుతున్నాడు. ట్రావెలింగ్ మీద ఇష్టంతో ఇతర దేశాలు కూడా తిరుగుతున్నాడు కార్ల్. హర్యానాకి చెందిన అమ్మాయిని పెండ్లి చేసుకుని, న్యూజిలాండ్‌లో కాపురం పెట్టాడు.
కార్ల్ రాక్ 1986 ఫిబ్రవరి 4న న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ సిటీలో పుట్టాడు. అతని అసలు పేరు కార్ల్ ఎడ్వర్డ్ రైస్. కాకేసియన్ సంతతికి చెందినవాడు. తల్లి కేట్ న్యూజిలాండ్‌లో బ్యాంక్ ఉద్యోగి. తండ్రి డౌగ్ కూడా ఒక ప్రభుత్వ సంస్థలో పనిచేసి రిటైర్ అయ్యాడు. ఇద్దరు తోబుట్టువులు నిక్, క్లో. కార్ల్ ‘మ్యూజిక్ అండ్ ఆడియో ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూజిలాండ్’లో చదువుకున్నాడు. తర్వాత ఆక్లాండ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశాడు. 2001– 2002 మధ్య ఆడియో ఇంజనీరింగ్ అండ్ మ్యూజిక్ ప్రొడక్షన్‌లో డిప్లొమా చేశాడు. 2006లో టెలివిజన్ అండ్ మీడియా స్టడీస్‌లో డిగ్రీ, 2010లో కంప్యూటర్ సైన్స్‌లో డిప్లొమా కూడా పూర్తి చేశాడు.
టీచర్‌గా మొదలై...
కార్ల్ రాక్ జీవితం న్యూజిలాండ్‌లో టీచర్ ఉద్యోగంతో మొదలైంది. చదువుకునే రోజుల్లోనే ఇండియాపై ఇష్టం ఏర్పడింది. దాంతో ఉద్యోగం చేస్తున్నప్పుడే అంటే... 2013లో ట్రావెలింగ్ జర్నీ మొదలుపెట్టి ఇండియాకు వచ్చాడు. తను ఇండియాలో చూసిందంతా డాక్యుమెంట్ చేయడానికి మొదట ఒక బ్లాగ్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత యూట్యూబ్ బాగా పాపులర్ కావడంతో 2017లో ‘కార్ల్ రాక్’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ పెట్టాడు. తన జర్నీని రికార్డ్ చేసి ఆ వీడియోలను ఛానెల్‌లో పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఇండియాలో కార్ల్ ఎక్స్‌పీరియెన్స్ చేసిన ప్రతి విషయాన్ని యూట్యూబ్ ద్వారా పంచుకుంటున్నాడు.
ఇండియాలోని ఫుడ్, కల్చర్ ట్రాన్స్‌పోర్టేషన్, ట్రావెలింగ్‌లో తీసుకోవాల్సిన సేఫ్టీ.. ఇలా ఒక్కటేమిటి ప్రతీది ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాడు. అందుకే ఛానెల్‌కు సబ్‌స్క్రయిబర్స్‌పెరుగుతూ వస్తున్నారు. ప్రస్తుతం కార్ల్ రాక్స్ ఛానెల్‌కు 2.78 మిలియన్ల సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఇప్పటివరకు ఛానెల్‌లో 600కు పైగా వీడియోలు అప్‌లోడ్ చేశాడు. వాటిలో షార్ట్ వీడియోలు కూడా ఉన్నాయి. కార్ల్ పాకిస్తాన్ వెళ్లినప్పుడు అక్కడి ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌లో ‘జై హింద్’ అన్నాడు. ఆ వీడియో షార్ట్ అప్‌లోడ్ చేశాడు. దానికి ఏకంగా 45 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
అయితే.. అతను ఇస్లామాబాద్‌లోని ఓ స్ట్రీట్‌లో టీ తాగుతూ ఇండియా, పాకిస్తాన్.. ఏ దేశంలో వీధుల్లో టీ తాగడం సేఫ్? అని ఒక వీడియో చేశాడు. దాంతో అతన్ని చాలామంది నెటిజన్లు వ్యతిరేకించారు. ఆ తర్వాత కార్ల్‌ని మళ్లీ వివాదంలోకి నెట్టాలనే ఉద్దేశంతో అక్కడి ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌లో ఒకతను టీ ఇచ్చి, పాకిస్తాన్ టీ బాగుందని చెప్పాలని కోరుతాడు. కానీ... దానికి సమాధానంగా కార్ల్ ‘‘ఇండియన్ టీ చాలా బాగుంటుంది. జై హింద్’’ అని చెప్పాడు. అతని ఛానెల్‌లో పోస్ట్ చేసిన మరో షార్ట్ వీడియోకు ఏకంగా 77 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
బడ్జెట్ ట్రావెలింగ్ గురించి...
ఫారినర్స్ ఇండియాలో ట్రావెల్ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా కార్ల్ ఎక్కువగా చెప్తుంటాడు. బడ్జెట్ ట్రావెలింగ్ ఎలా చేయాలో వివరిస్తాడు. అతని ఎక్స్‌పీరియెన్స్ పంచుకుంటాడు. ముంబైలో తనకి ఎదురైన బెగ్గింగ్ స్కామ్ గురించి కూడా ఒక వీడియో తీసి అప్‌లోడ్ చేశాడు. ఆ వీడియోకు 20 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. అతను విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ కూడా భారతీయ సంస్కృతికి ఉన్న ఇంపార్టెన్స్‌పై వీడియోలు చేస్తున్నాడు. విదేశాల్లో తినే ఇండియన్ ఫుడ్ మీద కూడా వీడియోలు చేశాడు కార్ల్.
వివాదం
ఇండియాలో కార్ల్ ఒక వివాదంలో చిక్కుకున్నాడు. అండమాన్–నికోబార్ ఐల్యాండ్స్‌లో కొన్ని ప్రాంతాల్లోకి విదేశీయులు వెళ్లాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఈ అనుమతికి సంబంధించిన రూల్స్‌ని భారత ప్రభుత్వం 2021 ఫిబ్రవరిలో తీసుకొచ్చింది. అదే ఏడాది మార్చిలో ఆ నిషేధిత ప్రదేశంలోకి అనుమతి లేకుండా వెళ్లాడనే అనుమానంతో కార్ల్ రాక్‌తో పాటు మరికొందరు విదేశీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ‘‘అనుకోకుండా ఆ ప్రాంతానికి వెళ్లా. కొత్త రూల్స్ గురించి నాకు తెలియద’’ని కార్ల్ చెప్పాడు. కానీ.. కొందరు మాత్రం అతను ఉద్దేశపూర్వకంగానే చట్టాన్ని ఉల్లంఘించాడని ఆరోపించారు.
ప్రేమించి... పెండ్లి చేసుకున్నాడు
కార్ల్ 2018లో హర్యానాకు చెందిన మనీషా మాలిక్‌ని పెండ్లి చేసుకున్నాడు. వాళ్లు మొదటిసారిగా 2016లో కలుసుకున్నారు. ఆమెకు బొల్లి అనే చర్మ వ్యాధి ఉంది. స్కిన్‌పై ఎక్కువగా ప్యాచ్‌లు ఉంటాయి. ఇద్దరూ ఇప్పుడు న్యూజిలాండ్‌లోనే ఉంటున్నారు. అయితే.. అక్కడ ఉన్నప్పుడు మనీషా తీసిన వీడియోలు ఎక్కువగా అప్‌లోడ్ చేస్తుంటారు.