యూట్యూబర్: ఫిట్ ఇండియా ఫ్రం అమెరికా

అమెరికాలో ఉంటూ.. ఇండియన్స్​కి ఫిట్‌‌నెస్‌‌ పాఠాలు చెప్తున్నాడు గురుమాన్‌‌. ఫిట్‌‌గా ఉండేందుకు ఏం తినాలి? ఏం తినకూడదు? ఏం చేయాలి?.. ఇలాంటి అన్ని విషయాలను యూట్యూబ్‌‌ ద్వారా  పంచుకుంటున్నాడు. ఇతను ఫిట్‌‌నెస్ ట్రైనర్ మాత్రమే కాదు.. మోడల్, మోటివేషనల్ స్పీకర్, ఎంట్రపెనూర్‌‌‌‌, సర్టిఫైడ్ డైటీషియన్‌‌. న్యూట్రిషన్​ గురించి పుస్తకాలు కూడా రాశాడు. 

గురుసింగ్ మాన్‌‌.. ఇండియాలో పుట్టి, పెరిగి అమెరికాలో ఉంటున్నాడు. పంజాబ్, అమృత్‌‌సర్‌‌లో 1981 ఆగస్టు 26న పుట్టాడు. ఆ తర్వాత కుటుంబం అంతా అమెరికా వెళ్లిపోయింది. అతని తండ్రి ఒక రైతు. 2018లో చనిపోయాడు. అదే ఏడాది మాన్​కు ఆడపిల్ల పుట్టింది. మాన్‌‌ తన తల్లి, భార్య హర్మాన్ , కూతురు జియాతో కలిసి అమెరికాలో ఉంటున్నాడు. 

బాడీ బిల్డింగ్‌‌

గురు అమెరికాలోని కాలిఫోర్నియాలో చదువుకున్నాడు. చిన్నప్పటినుంచి బాడీబిల్డింగ్ అంటే చాలా ఆసక్తి ఉండేది. భవిష్యత్తులో గొప్ప బాడీబిల్డర్‌‌‌‌ కావాలని కలలు కనేవాడు. అందుకే కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో బయోమెకానిక్స్ (ఎక్సర్‌‌సైజ్, స్పోర్ట్స్ సైన్స్, న్యూట్రిషన్ సైన్స్‌‌)లో బ్యాచిలర్ డిగ్రీ చేశాడు. చదువు పూర్తయిన వెంటనే బాడీబిల్డర్, మోడల్‌‌గా జీవితాన్ని మొదలుపెట్టాడు. బాడీ బిల్డర్‌‌‌‌గా ఎదిగిన తర్వాత డయాబెటిస్, కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెజర్.. లాంటి వ్యాధులు ఉన్నవాళ్లకు సలహాలు ఇవ్వడం ప్రారంభించాడు. గురు చెప్పిన డైట్ ప్రోగ్రామ్స్‌‌ వ్యాధులను ఎదుర్కోవడంలో చాలామందికి ఉపయోగపడ్డాయి! ఆ తర్వాత ఫిట్‌‌నెస్ ట్రైనర్‌‌‌‌గా మారాడు. 

డ్రగ్స్‌‌ ఫ్రీ ఫిట్‌‌నెస్‌‌ 

మాన్‌‌ 19 ఏండ్ల నుండి డ్రగ్స్ వాడకుండా ఫిట్‌‌నెస్ ఎలా సాధించాలనే విషయం మీద అవగాహన కల్పిస్తున్నాడు. అలాంటి మోడల్స్ కోసం పనిచేస్తున్నాడు. అదే పద్ధతిలో అమెరికాలో ఎంతోమందికి ట్రైనింగ్‌‌ కూడా ఇస్తున్నాడు. అథ్లెట్స్‌‌ పోషకాహారంతో బాడీ బిల్డ్‌‌ చేసుకోవడానికి హెల్ప్​ చేస్తున్నాడు. అతని దగ్గర చాలామంది అథ్లెట్లు ట్రైనింగ్‌‌ తీసుకుంటున్నారు. 

న్యూట్రిషనిస్ట్‌‌

గురు బాడీ బిల్డర్ మాత్రమే కాదు.. అమెరికన్ స్పోర్ట్స్‌‌ అండ్ ఫిట్‌‌నెస్ అసోసియేషన్ నుంచి సర్టిఫికెట్‌‌ పొందిన న్యూట్రిషనిస్ట్‌‌ కూడా. అందుకే కొలెస్ట్రాల్, లివర్ డిసీజ్, ఆర్థరైటిస్, స్టమక్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, థైరాయిడ్, డయాబెటిస్, ఆర్థరైటిస్, బ్లడ్ ప్రెషర్, ప్రొస్టేట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్న ఎంతోమందికి న్యూట్రియెంట్‌‌ ఫుడ్‌‌ ఎలా తీసుకోవాలో చెప్తుంటాడు.  అంతేకాదు.. ఇప్పటివరకు సొంతంగా 50కి పైగా ‘ఫిట్​నెస్​ ప్రోగ్రామ్స్‌‌’ లాంచ్‌‌ చేశాడు.
  
యూట్యూబ్‌‌ ఛానెల్‌‌ 

హెల్త్‌‌, ఫిట్‌‌నెస్‌‌కు సంబంధించిన ఇన్ఫర్మేషన్‌‌, న్యూట్రియెంట్‌‌ షెడ్యూల్స్‌‌, ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ గైడెన్స్‌‌, బాడీని బట్టి చేయాల్సిన ఎక్సర్‌‌‌‌సైజ్‌‌లు.. ఇలాంటి వాటి పట్ల అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో  యూట్యూబ్‌‌ ఛానెల్ పెట్టాలి అనుకున్నాడు. ‘గురు మాన్‌‌ ఫిట్‌‌నెస్‌‌’ పేరుతో 2015లో ఛానెల్‌‌ మొదలుపెట్టాడు. ఈ ఛానెల్‌‌ను ప్రస్తుతం 2.37 మిలియన్ల మంది సబ్‌‌స్క్రయిబ్‌‌ చేసుకున్నారు. ఈ ఛానెల్‌‌తో పాటు ‘ఎక్స్‌‌, ఇన్‌‌స్టాగ్రామ్‌‌, ఫేస్‌‌బుక్‌‌’లో కూడా గురుని చాలామంది ఫాలో అవుతారు. యూట్యూబ్ ఛానెల్‌‌లో ఇప్పటివరకు 436 వీడియోలు అప్‌‌లోడ్‌‌ చేశాడు. వాటిలో మిలియన్‌‌కుపైగా వ్యూస్‌‌ వచ్చిన వీడియోలు చాలానే ఉన్నాయి. ఈ వీడియోల్లో ఎవరెవరు ఏం తినాలి? ఏం తినకూడదు? అనే విషయాలు చెప్తున్నాడు. అంతేకాకుండా మాన్‌‌ ‘జీఎం న్యూట్రిషన్’ పేరుతో ఒక ఫిట్‌‌నెస్ బ్రాండ్‌‌ని కూడా మార్కెట్‌‌లోకి తెచ్చాడు. 

ఫిట్‌‌ ఇండియా 

దేశాన్ని ఫిట్‌‌ ఇండియాగా చూడాలనే ఉద్దేశంతో యూట్యూబ్‌‌లో పలు రకాల డైట్స్, ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ ప్రోగ్రామ్స్‌‌ వీడియోలని అప్‌‌లోడ్‌‌ చేశాడు. ముఖ్యంగా భారతీయ మహిళల కోసం ప్రత్యేకంగా ‘విమెన్ సిరీస్’ చేశాడు. ఇండియన్ ఫుడ్‌‌ని ఇష్టపడేవాళ్ల కోసం ‘దేశీ డైట్‌‌ ప్రోగ్రామ్‌‌’ పేరుతో ఒక వీడియో చేశాడు. పిల్లల కోసం ‘బేబీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్’, ‘కిడ్స్ డైట్– గురు మాన్ ప్రోగ్రామ్’ చేశాడు. 

సక్సెస్​తో సంపాదన

గురుమాన్ అమెరికాలో సక్సెస్‌‌ఫుల్‌‌ ఫిట్‌‌నెస్ ట్రైనర్‌‌‌‌, బాడీబిల్డర్.. కాబట్టి బాగానే సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం అతని ఆస్తుల విలువ మిలియన్ డాలర్లకు పైగానే ఉంటుందని అంచనా. గురుకి శాన్‌‌ఫ్రాన్సిస్కోలో, న్యూయార్క్‌‌లో ఇళ్లు ఉన్నాయి. ఇండియాలో కూడా కొన్ని ఆస్తులు ఉన్నాయి. పంజాబ్‌‌, అమృత్‌‌సర్‌‌లో ఒక ఇల్లు ఉంది. యూట్యూబ్‌‌ నుంచి కూడా ఆదాయం బాగానే వస్తోంది. గురుమాన్‌‌కు కార్లు అంటే ఇష్టం. అతని కార్ల కలెక్షన్‌‌లో ‘రేంజ్ రోవర్, ఆడి’ లాంటి కాస్ట్‌‌లీ కార్లే ఎక్కువ కనిపిస్తాయి.