యూట్యూబ్ ప్రపంచమంతటా పాపులర్ అయిన యాప్. పల్లె నుంచి సిటీ వరకు అందరూ వాడే యాప్ ఏదంటే యూట్యూబ్. వాడడానికి చాలా సులువుగా ఉంటుంది. ఎవరికి ఏ సమాచారం కావాలన్నా అందులో దొరుకుతుంది. అందుకే యూట్యూబ్‌కి అంత క్రేజ్. అయితే, ఇప్పుడు యూట్యూబ్ మరో కొత్త ఫీచర్ తెచ్చింది. అది కూడా యూట్యూబ్ యూజర్లకు బాగా నచ్చుతుంది. అదే ప్లేయబుల్స్. ఈ ఫీచర్‌తో యూట్యూబ్‌లో ఇకనుంచి గేమ్స్ కూడా ఆడుకోవచ్చన్నమాట.
వీడియో గేమ్స్ ఆడుకోవచ్చు
మామూలుగా చిన్నపిల్లలు, పెద్దవాళ్లు కూడా అప్పుడప్పుడు సరదాగా వీడియో గేమ్స్ ఆడుతుంటారు. అయితే ఏ గేమ్ ఆడాలన్నా ముందుగా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాతే ఆడుకునే వీలవుతుంది. ఇకమీదట ఎలాంటి యాప్స్ వాడకుండా గేమ్ ఆడాలనుకుంటే యూట్యూబ్ బెస్ట్ ప్లాట్‌ఫాం. వీడియో గేమ్స్ ఆడేవాళ్ల కోసమే యూట్యూబ్‌లో గూగుల్ ప్లేయబుల్ అనే ఫీచర్ తీసుకొచ్చింది. ప్లేయబుల్స్ ఫీచర్ వాడి వీడియో గేమ్స్ ఆడొచ్చు.
ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రీమియం యూజర్లకు... అంటే పేమెంట్ యూజర్ల కోసం టెస్టింగ్‌లో ఉంది. 28 మార్చి 2024 నాటికి ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. ఆ తరువాత పేమెంట్ యూజర్లతో పాటు అందరికీ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అందులో 37 గేమ్స్ ఉన్నాయి. ‘యాంగ్రీ బర్డ్స్ షో డౌన్, కానన్ బాల్స్ త్రీడీ, బ్రెయిన్ అవుట్ అండ్ డైలీ క్రాస్ వర్డ్స్, డైలీ సోలిటైర్ అండ్ జిన్ రమ్మీ’ వంటి కార్డ్ గేమ్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఇండియాలో యూట్యూబ్ ప్రీమియం ధర ఏడాదికి 1,290 రూపాయలు. మూడు నెలల ప్లాన్‌కి 399 రూపాయలు. ఒక నెలకు అయితే ప్రి– పెయిడ్ ప్లాన్139 రూపాయలు.
థ్రెడ్స్‌లో కీవర్డ్ సెర్చ్
ఇన్స్టాగ్రామ్ ప్లాట్‌ఫాం నుంచి థ్రెడ్స్ అనే యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఇప్పుడిప్పుడే కొత్త ఫీచర్లు తెస్తోంది. అందులో భాగంగా వచ్చిన కొత్త ఫీచర్ ఏంటంటే.. ఇప్పటివరకు థ్రెడ్స్‌లో కీవర్డ్ సెర్చ్ ఫీచర్ లేదు. అది ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ‘ఈ ఫీచర్‌ని ప్రస్తుతం ఆస్ట్రేలియాలో టెస్ట్ చేస్తున్నాం. దీని ద్వారా రిలేటెడ్ పోస్ట్‌లు, థీమ్స్ ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. ఇది అచ్చం ఎక్స్ (ట్విటర్)లో లాగానే ఉంటుంది. దీనికి మరిన్ని మెరుగులు దిద్దాలి’ అని ఇన్స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సెరి చెప్పారు. త్వరలోనే దీన్ని అన్ని భాషల్లో తెస్తాం అంటున్నారు. మొదట ఇంగ్లిష్ మాట్లాడే దేశాల్లో దీన్ని టెస్ట్ చేశారు. తర్వాత స్పానిష్ మాట్లాడే దేశాల్లో టెస్ట్ చేస్తారట. ఇన్‌స్టాగ్రామ్‌తో సంబంధంలేకుండా థ్రెడ్స్ అకౌంట్‌ని డిలీట్ చేసే ఆప్షన్ అప్డేట్ చేసిన విషయం తెలిసిందే.
క్యూఆర్‌తో వాట్సాప్ పేమెంట్స్
ఆన్లైన్ పేమెంట్స్ వచ్చాక అందరూ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయడానికే ఇష్టపడుతున్నారు. అందుకే వాట్సాప్‌లో పేమెంట్స్ చేసుకునేలా అప్ డేట్ అయింది. ఎవరికైనా డబ్బులు పంపాలంటే వాట్సాప్‌లో మెసేజ్ బార్ ఉన్న రూపాయి ఐకాన్ మీద ట్యాప్ చేసి, అమౌంట్ ఎంటర్ చేయాలి. అమౌంట్ ఎంటర్ చేశాక యూపీఐ ద్వారా పేమెంట్ చేయొచ్చు. అచ్చం ఇలానే క్యూఆర్ కోడ్‌తో కూడా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అదెలాగంటే.. వాట్సాప్ ఓపెన్ చేయగానే కుడివైపు పైన మూడు చుక్కలు కనిపిస్తాయి.
వాటిపై ట్యాప్ చేస్తే ‘పేమెంట్స్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద ట్యాప్ చేయగానే యూపీఐతో లింక్ అయి ఉన్న మీ పేరు కనిపిస్తుంది. దాని కింద ‘సెండ్ పేమెంట్స్’, ‘స్కాన్ పేమెంట్ క్యూఆర్ కోడ్’ అని రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. ఎవరికి డబ్బు పంపాలో వాళ్ల కోడ్ స్కాన్ చేసి, పేమెంట్ చేయొచ్చు. ఎవరైనా మీకు పేమెంట్ చేయాలనుకుంటే ఇదే ప్రాసెస్‌లో క్యూఆర్ కోడ్ ఆప్షన్ ఎంచుకుంటే స్కాన్ కోడ్ పక్కన ‘మై కోడ్’ అని ఉంటుంది. దానిమీద ట్యాప్ చేస్తే మీ కోడ్ కనిపిస్తుంది. దాన్ని ఉపయోగించి అవతలి వాళ్లు మీకు మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చన్నమా ట.