పాతబస్తీలో మిలాద్​ఉన్ నబీ భారీ ర్యాలీ

మిలాద్ ఉన్‌‌‌‌‌‌‌‌ నబీ సందర్భంగా గురువారం పాతబస్తీలో ముస్లిం యువకులు భారీ ర్యాలీ నిర్వహించారు. గుల్జార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్ నుంచి మొదలైన ర్యాలీ పత్తర్ గట్టి, మదీనా చౌరస్తా, చత్తాబజార్, పురానీహవేలి, మీర్​ఆలం మండీ, కోట్ల అలిజా మీదుగా మొఘల్‌‌‌‌‌‌‌‌పురా వరకు సాగింది. దారి పొడవునా ముస్లిం యువత జెండాలు ఊపుతూ ఆధ్యాత్మిక నినాదాలు చేశారు. సిటీ సీపీ సీవీ ఆనంద్‌‌‌‌‌‌‌‌, ఉన్నతాధికారులు బందోస్తును పర్యవేక్షించారు. కాగా గురువారం రాత్రి ఆల్ ఇండియా సున్ని యునైటెడ్ ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. 

చార్మినార్​సమీపంలో ఓ యువకుడు పటాకులు కాల్చుతుండగా నిప్పు రవ్వలు ఎగిరి డీజే వెహికల్​లోని జనరేటర్​పై పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఫైర్​ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. మంగళహాట్ పీఎస్​ పరిధిలో నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడిన వ్యక్తిని పోలీసులు చికిత్స నిమిత్తం ఉస్మానియాకి తరలించారు. – హైదరాబాద్/మెహిదీపట్నం/షాద్​నగర్​, వెలుగు