పెళ్లి బరాత్‌లో డాన్స్ చేస్తూ.. 23 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతి

ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు.. 23 ఏళ్ల కుర్రోడు.. ఎలాంటి చెడు అలవాట్లు లేవు.. ఎంతో చెలాకీగా ఉంటాడు.. రెండు రోజులుగా పెళ్లి వేడుకల్లో సందడి చేశాడు.. అంతలోనే ఆ కుర్రోడు అనంతలోకాలకు వెళ్లిపోయాడు.. కారణం కార్డియాక్ అరెస్ట్. అవును గుండెపోటుతో అప్పటికప్పుడు కళ్ల ముందు చనిపోయాడు. ఈ హృదయ విదాకరమైన ఘటన తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం మోత్కూరావుపేట గ్రామంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కమ్మరిపేట గ్రామానికి చెందిన 23 ఏళ్ల సంజీవ్ అనే యువకుడు. తన మేనమామ కుమారుడు అంటే బావ పెళ్లికి మోత్కూరావుపేట వచ్చాడు. మామయ్య ఇంట్లో వేడుక.. బావ పెళ్లిలో ఎంతో సందడి చేశాడు. 2024, నవంబర్ 13వ తేదీ రాత్రి పెళ్లి బరాత్ వేడుక.. బరాత్‌లో సంజీవ్ డాన్స్ చేస్తున్నారు. బంధువులు, ఫ్రెండ్స్ తో కలిసి డాన్స్ చేస్తుండగా.. ఒక్కసారిగా రోడ్డుపైనే కుప్పకూలిపోయాడు. పడిపోయిన సంజీవ్ కు ఉలుకూ పలుకూ లేదు. 

బంధువులు అందరూ వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చనిపోయినట్లు చెప్పారు డాక్టర్లు. కార్డియాక్ అరెస్ట్ అంట.. తీవ్ర గుండెపోటు రావటంతో చనిపోయినట్లు ప్రకటించారు డాక్టర్లు. దీంతో పెళ్లి వేడుకలో విషాధం. 23 ఏళ్ల కుర్రోడు.. బాగా చదువుకుంటున్నాడు.. చేతికి అంది వచ్చాడు.. నిర్జీవంగా మారటాన్ని తల్లిదండ్రులు, బంధువులు జీర్ణించుకోలేకుండా ఉన్నారు. కన్నీరు మున్నీరు అవుతున్నారు.