మహాశివరాత్రికి ఘనంగా ఏర్పాట్లు

  • కలెక్టర్, ఎస్పీలతో ప్రభుత్వ విప్ సమావేశం
  • అదనపు బస్సులు, భక్తుల భద్రత, తాగునీటి సరఫరా తదితర అంశాలపై సమీక్ష 

వేములవాడ, వెలుగు: వేములవాడలో -మహాశివరాత్రి జాతర ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు.  బుధవారం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఓపెన్ స్లాబ్ లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధ్యక్షతన  మహా శివరాత్రి జాతర సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ..   ఫిబ్రవరి 25 నుంచి ఫిబ్రవరి 27 వరకు 3 రోజుల పాటు మహా శివరాత్రి జాతర నిర్వహించనున్నట్లు తెలిపారు.

జాతర సందర్భంగా అదనపు బస్సులు, పారిశుద్ధ్యం, పార్కింగ్, రోడ్డు నిర్వహణ, దేవాలయం వద్ద వసతి సౌకర్యం, తాగునీటి సరఫరా,  హెల్త్ క్యాంప్ ఏర్పాటు,  ఫైర్ ఇంజిన్ సౌకర్యం,  కల్యాణ కట్ట, ధర్మ గుండం, బద్ది పోచమ్మ ఆలయం, హెల్ప్ సెంటర్ , సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అంశాలపై సంబంధిత శాఖ అధికారులు సిద్ధం చేసుకున్న ప్రణాళికను వివరించారు.  భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అదనపు కల్యాణ కట్టలు, బద్ది పోచమ్మ ఆలయం , నాంపల్లి ఆలయం వద్ద అదనపు క్యూ లైన్లు సిద్ధం చేయాలన్నారు.

 పార్కింగ్ ,  అవసరమైన భద్రత కల్పించాలని, విద్యుత్ అలంకరణ పనులు ఆకర్షణీయంగా చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు.  మూడు రోజుల పాటు గస్తీ కొనసాగుతుందని, ఈ సారి పట్టణంతో పాటు ఆలయ పరిసరాల్లో అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ అఖిల్ మహజన్ తెలిపారు.  అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్, అదనపు ఎస్పీ శేషాద్రి రెడ్డి, ఈఓ వినోద్ రెడ్డి, రెవెన్యూ డివిజన్ అధికారి రాజేశ్వర్, మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, మున్సిపల్ వైస్ చైర్మన్ మహేశ్ తదితరులు పాల్గొన్నారు. 

లడ్డూ తయారీ కేంద్రం పరిశీలన

మహాశివరాత్రి జాతర సమన్వయ సమావేశం అనంతరం విప్, కలెక్టర్, ఎస్పీ తదితరులు ఆలయంలో స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా వారిని ఆలయ ఈవో వినోద్ రెడ్డి శాలువాలతో సన్మానించి, స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు.  అర్చకులు ఆశీర్వచనం ఇచ్చి   లడ్డూ ప్రసాదం అందజేశారు.  అనంతరం వారు లడ్డూ తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. స్టోర్ రూం, లడ్డూ తయారీకి వినియోగించే పదార్థాలు, నెయ్యి, తయారీ విధానం, పరిసరాలు తనిఖీ చేశారు.

రోజు ఎంత నెయ్యి వినియోగిస్తున్నారు, ఎన్ని లడ్డూలు తయారు చేస్తున్నారో తెలుసుకున్నారు. ఎంత మంది సిబ్బంది పనిచేస్తున్నారో ఆరా తీశారు. లడ్డూ ప్రసాదం తయారీ కేంద్రాన్ని పూర్తిగా ఆధునీకరించాలని, భక్తుల సంఖ్యకు అనుగుణంగా ప్రసాదం అందేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. నాణ్యతా, పరిశుభ్రతపై దృష్టిపెట్టాలన్నారు.