గల్ఫ్‌‌లో వేంపేట యువకుడు సూసైడ్‌‌

  • బిజినెస్‌‌ కోసం చేసిన అప్పులు  తీర్చేందుకు బహ్రెయిన్‌‌ వెళ్లిన వ్యక్తి
  • అప్పులు తీరక మనస్తాపంతో ఆత్మహత్య

మెట్‌‌పల్లి, వెలుగు : బిజినెస్‌‌ కోసం చేసిన అప్పులు తీర్చేందుకు గల్ఫ్‌‌ వెళ్లినా.. అవి తీరకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు అక్కడే సూసైడ్‌‌ చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా మెట్‌‌పల్లి మండలం వెంపేట గ్రామానికి చెందిన మారంపల్లి సుధీర్‌‌ (36) స్థానికంగా దాబా నిర్వహించేవాడు. వ్యాపారం కోసం తీసుకున్న అప్పులు రోజు రోజుకు పెరగడం, అప్పు ఇచ్చిన వాళ్లు కట్టాలని ఒత్తిడి చేయడంతో రెండున్నరేండ్ల కింద గల్ఫ్‌‌ దేశమైన బహ్రెయిన్‌‌ వెళ్లాడు. అక్కడ ఓ కంపెనీలో పనిచేస్తుండగా వచ్చే శాలరీ కుటుంబపోషణకే చాలలేదు. 

దీంతో అప్పులు చెల్లించలేకపోయాడు. అప్పు ఇచ్చిన వారు సుధీర్‌‌ ఇంటికి వెళ్లి ఒత్తిడి చేయడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న సుధీర్‌‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గురువారం ఉదయం డ్యూటీకి వెళ్లే టైం అయినా సుధీర్‌‌ రూమ్‌‌ నుంచి బయటకు రాకపోవడంతో తోటి కార్మికులు లోపలికి వెళ్లి చూడగా మంచానికి ఉరి వేసుకొని కనిపించాడు. దీంతో సుధీర్‌‌ సూసైడ్‌‌ విషయాన్ని వేంపేటలోని కుటంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. 

మృతుడికి భార్య గిరిజ, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. సుధీర కుటుంబాన్ని బ్లాక్‌‌ కాంగ్రెస్‌‌ అధ్యక్షుడు మహేందర్‌‌రెడ్డి పరామర్శించారు. సుధీర్ మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.