Kitchen Idea : ఉల్లిపాయ కారం, సల్లచారు, సజ్జరొట్టెలు.. ఫటాఫట్ నిమిషాల్లో ఇలా చేయొచ్చు..!

సజ్జ రొట్టెలు.. ఉప్పిడి పిండి.. ఉల్లి కారం.. సల్ల చారు.. చిటికెలో అయిపోయే వంటలు ఇవి. ఆకలి బాగా వేస్తున్నప్పుడు, సమయం తక్కువ ఉన్నప్పుడు వీటిని వండుకోవచ్చు. 

సల్ల చారు

కావాల్సినవి:
చిక్కని మజ్జిగ: ఒక కప్పు, పచ్చిమిర్చి: ఐదు, వెన్న: రెండు టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి : రెండు, జీలకర్ర: అర టీ స్పూన్, ఆవాలు: అర టీ స్పూన్, కరివేపాకు: రెండు రెమ్మలు, పసుపు, ఆవపిండి, శొంఠి పిండి, వెల్లుల్లి ముద్ద: ఒక టీ స్పూన్ చొప్పున

తయారీ:
మజ్జిగను ఒక గిన్నెలో తీసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి మంటపై పచ్చిమిర్చిని కాల్చాలి. వాటిని రోటిలో వేసి మెత్తగా దంచి మజ్జిగలో కలపాలి. తర్వాత ఉప్పు, శొంఠిపొడి, ఆవాల పొడి కూడా వేసి కలపాలి. స్టవ్ మీద పాన్ పెట్టి వెన్న వేడి చేయ్యాలి. తరువాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి ముద్ద, పసుపు వేసి వేగించి మజ్జిగలో కలిపితే సల్ల చారు రెడీ.

ఉప్పిడిపిండి

కావాల్సినవి:
బియ్యం రవ్వ: ఒకకప్పు, నీళ్లు: మూడు కప్పులు, జీలకర్ర: రెండు టీ స్పూన్లు, ఆవాలు: ఒక టీ స్పూన్, కరివేపాకు: రెండు రెమ్మలు, పచ్చిమిర్చి: నాలుగు (సన్నగా తరిగినవి) పచ్చి శెనగ పప్పు: ఒక టేబుల్ స్పూన్, ఉల్లిగడ్డ తరుగు: అర కప్పు (సన్నగా, పొడవుగా తరిగినవి), ఉప్పు, నూనె: తగినంత 

తయారీ:
స్టవ్ మీద బాండీ పెట్టి నూనె వేడి చెయ్యాలి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిశెనగ పప్పు, ఉల్లిగడ్డ తరుగు, పచ్చిమిర్చి వేసి వేగించాలి. అవి వేగాక నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరిగాక బియ్యం రవ్వ వేసి ఐదు నిమిషాలు ఉడికిస్తే ఉప్పిడిపిండి రెడీ. బడికి వెళ్లే పిల్లలకు అప్పటికప్పుడు చేసి వేడివేడిగా పెట్టొచ్చు.

సజ్జ రొట్టెలు

సజ్జ పిండి: ఒక కప్పు, నీళ్లు: మూడు కప్పులు, ఉప్పు: తగినంత

తయారీ:
స్టవ్ మీద బాండీ పెట్టి ఒక గిన్నెలో పిండికి మూడొంతులు నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు సజ్జపిండి పోసి, తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి. పిండి ముద్దగా అయ్యాక స్టవ్ ఆపేయాలి.. వేడి చల్లారాక ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా చెయ్యాలి. తర్వాత ఒక పీటపై కొద్దిగా పొడి పిండి వేసి చేతితో అద్దుతూ రొట్టెలా చెయ్యాలి. స్టవ్ మీద పెనం పెట్టి వేడి చెయ్యాలి. రొట్టెపై కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుతూ మాడకుండా కాల్చాలి. ఒక కప్పు పిండితో మూడు రొట్టెలు చెయ్యొచ్చు.

ఉల్లిపాయ కారం

కావాల్సినవి:
ఉల్లిగడ్డ తరుగు : ఒక కప్పు, జీలకర్ర: ఒకటీ స్పూన్, నువ్వులు: రెండు టేబుల్ స్పూన్లు, ధనియాలు: రెండు టేబుల్ స్పూన్లు, కరివేపాకు: రెండు రెమ్మలు, పచ్చిమిర్చి: ఆరు (సన్నగా తరిగి), పసుపు: పావు టీ స్పూన్, ఉప్పు, నూనె, నెయ్యి : తగినంత

తయారీ:
స్టవ్ మీద బాండీ పెట్టి నూనె వేడిచెయ్యాలి. జీలకర్ర, నువ్వులు, ధనియాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు వేగించాలి. తర్వాత ఉల్లిగడ్డ తరుగు, పసుపు వేసి వేగించాలి. అవి వేగాక కొద్దిగా ఉప్పు వేసి స్టవ్ ఆపేయాలి. వేగిన మిశ్రమాన్ని మిక్సీ పట్టాలి. తర్వాత పోపు పెడితే 'ఉల్లిపాయ కారం' సూపర్గా ఉంటుంది. సజ్జ రొట్టెల్లో... వేడి వేడి అన్నంలో తింటే బాగుంటుంది.