ప్రపంచానికి భారత్​ బహుమతి యోగా

ప్రాచీన భారతీయ సంప్రదాయ అమూల్యమైన బహుమతి యోగా.  ఆలోచన - చర్య, నిగ్రహం -నెరవేర్పు,  మనిషి - ప్రకృతి మధ్య సామరస్యం, ఆరోగ్యం - శ్రేయస్సుకు సమగ్ర విధానమే యోగా.    ప్రధాని  నరేంద్రమోదీ 2014లో   ఐక్యరాజ్యసమితి ప్రసంగంలో, ఉత్తరార్ధ గోళంలో, సంవత్సరంలో అత్యంత సుదీర్ఘమైన, సూర్యుడు ఆకాశంలో అత్యున్నత స్థానంలో ఉన్న రోజు జూన్ 21ని  యోగా దినోత్సవంగా జరుపుకోవాలని సూచించారు. ఈ సార్వత్రిక విజ్ఞప్తి గుర్తించి, డిసెంబర్ 11, 2014 లో ఐక్యరాజ్యసమితి, జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 69/31 తీర్మానం ద్వారా ప్రకటించింది. భారతదేశం అంతర్జాతీయ యోగా దినోత్సవంను ఏర్పాటు చేస్తూ ముసాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించింది.  దీనిని 175 సభ్య దేశాలు ఆమోదించాయి. ఏటా జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం.  ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట ఇతివృత్తంతో జరుపుకునే ఈ కార్యక్రమాన్ని, ఈ సంవత్సరం ‘మహిళా సాధికారత కోసం యోగా’ అనే ప్రధాన ఇతివృత్తంతో జరుపుకుంటున్నాం. 

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

10వ సారి జరిగే ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం, మహిళల శ్రేయస్సును ప్రోత్సహించడం, మహిళల ఆరోగ్యాన్ని నిర్వహించడం, ప్రపంచ ఆరోగ్యం, శాంతిని పెంపొందించడం, మహిళల్లో విశ్వాసం, ఆత్మగౌరవాన్ని పెంపొందించడంపై ప్రత్యేక దృష్టిని సారించి యోగాపై విస్తృత అవగాహనను కల్పిస్తుంది.  నేటి కాలంలో  ఆరోగ్య సమస్యలు రోజురోజుకీ పెరుగుతుండటంతో యోగా  ప్రాధాన్యత బాగా పెరిగింది. భక్తి యోగా, కర్మయోగా, క్రియ యోగా, జ్ఞానయోగ అని నాలుగు విభిన్న వర్గాలుగా యోగా వర్గీకరించబడింది. వివిధ రకాల యోగాసనాలు అనేక శరీర కదలికలను కలిగి,  శారీరకశక్తి, రోగనిరోధక వ్యవస్థను పెంపొందించడానికి, పూర్తి ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడతాయి. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడే యోగాను క్రమం తప్పకుండా అభ్యాసం చేయడం వల్ల ఆందోళనను తగ్గించవచ్చు. డిప్రెషన్ చికిత్సలో, నిద్రను మెరుగుపరచడంలో, గుండె సంబంధిత వ్యాధులు, జీవనశైలికి సంబంధించిన అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతున్నది. ఆత్మ పరిశీలనను ప్రోత్సహిస్తోంది. యోగాభ్యాసం కాంతి, తేజస్సును కూడా పెంపొందిస్తుంది.

సామాజిక సంరక్షణలో యోగా కీలకపాత్ర

యోగా జీవితంలోని అన్ని అంశాల మధ్య సమతుల్యతను సాధించడమే కాకుండా ఆరోగ్యం, శ్రేయస్సు కోసం సంపూర్ణమైన విధానాన్ని అందిస్తుందని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. యోగా సాధన వల్ల కలిగే ప్రయోజనాల గురించి విస్తృతంగా ప్రచారం చేయడం, ప్రపంచ జనాభా ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.  ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆరోగ్యంగా, పునరుజ్జీవనం పొందేందుకు, సామాజిక ఒంటరితనం,  నిరాశకి  వ్యతిరేకంగా ఈ యోగాను స్వీకరించారు.  కొవిడ్-19 మహమ్మారి సమయంలో,  క్వారంటైన్ ,  ఐసోలేషన్ లో ఉన్న రోగుల మానసిక, సామాజిక సంరక్షణ పునరావాసంలో యోగా ముఖ్యమైన పాత్ర పోషించింది. 

యోగాతో క్రమశిక్షణ, ఏకాగ్రత

క్రమశిక్షణతో కూడిన, సంతృప్తికరమైన, సరళమైన, ఏకాగ్రతతో కూడిన జీవితాన్ని గడపడానికి యోగాను అభ్యసించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా యోగాను అత్యంత అంకితభావంతో అభ్యసిస్తే, అది ఆరోగ్యకరమైన సంతోషకరమైన, క్రమశిక్షణ గల వ్యక్తులను సృష్టిస్తుంది. మహిళల సంక్షేమం, ప్రపంచ ఆరోగ్యం, శాంతి సాధన లక్యంగా జరుపుకునే  యోగా  మహోత్సవం 2024, మహిళలకు  సాధికారత  కల్పించడానికి, మహిళల ఆరోగ్యంపై దృష్టి సారించడానికి ఒక సమగ్ర సాధనంగా ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది యోగావల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి అవగాహన కల్పించే మార్గం.

- డా. చిందం రవీందర్