ఈమెది జగిత్యాల.. దుబాయ్లో కాపురం.. భర్త, పిల్లలు ఇంటికొచ్చేసరికి జరిగిందీ ఘోరం..

జగిత్యాల: దుబాయ్లో జగిత్యాలకు చెందిన ఎన్నమనేని సుప్రియ(35) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన విషాదం నింపింది. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం అంబారిపేటకు చెందిన శ్రీనివాసరావుతో ఇదే జిల్లాకు చెందిన రాయికల్ మండలం కుమ్మరిపల్లికి చెందిన సుప్రియకు 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.

ఉద్యోగ రీత్యా పిల్లలతో కలిసి ఈ దంపతులు దుబాయ్లో ఉంటున్నారు. బుధవారం కూడా రోజూలానే సుప్రియ భర్త శ్రీనివాసరావు ఉద్యోగానికి వెళ్లాడు. పిల్లలు స్కూల్కు వెళ్లారు. భర్త, పిల్లలు ఇంటికి  వచ్చే సరికి సుప్రియ శవమై కనిపించింది.

ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది సుప్రియ అచేతనంగా కనిపించడంతో భర్త, పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. సుప్రియ చనిపోయిన విషయం తెలిసి ఆమె స్వగ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు.

దుబాయ్ నుంచి సుప్రియ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుప్రియది ఆత్మహత్యనా లేదా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందోననే అనుమానం ఆమె స్వగ్రామంలో వ్యక్తమవుతోంది.