మల్లన్నసాగర్ వైపు ఎల్లంపల్లి నీళ్లు!

  •     గోదావరి జలాల ఎత్తిపోతలకు పెద్దదిక్కుగా మారిన శ్రీపాదసాగర్
  •    పది రోజుల్లో మిడ్​ మానేరుకు 11 టీఎంసీలు లిఫ్టింగ్
  •     అక్కడి నుంచి తాజాగా రంగనాయకసాగర్​కు
  •     త్వరలోనే మల్లన్నసాగర్​కు తరలించే ఏర్పాట్లు
  •     వరుసగా ఐదో ఏడాది కూడా ఉపయోగపడని కాళేశ్వరం
  •     ఎప్పట్లాగే ఈసారి సైతం ఆదుకున్న ఎల్లంపల్లి

హైదరాబాద్​/సిద్దిపేట, వెలుగు : గత సర్కారు సుమారు లక్ష కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కట్టిన కాళేశ్వరం వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో వరుసగా ఐదో ఏడాది కూడా గోదావరి ఎత్తిపోతలకు ఎల్లంపల్లి ప్రాజెక్టే దిక్కయింది. గడిచిన పది రోజులుగా ఇంజినీర్లు ఎల్లంపల్లి నుంచి నిత్యం పదివేల క్యూసెక్కులకుపైగా నీటిని ఎగువకు ఎత్తిపోస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సిరిసిల్ల జిల్లాలోని మిడ్​మానేరు జలకళ సంతరించుకోగా, అక్కడి నుంచి మంగళవారం సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ కు నీటి లిఫ్టింగ్ ప్రారంభించారు. త్వరలోనే మల్లన్నసాగర్​కు తరలించే ఏర్పాట్లు చేస్తుండగా, సిద్దిపేట జిల్లా రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.

10 రోజుల్లో 11 టీఎంసీలు లిఫ్ట్..

ఎల్లంపల్లి ప్రాజెక్టు కెపాసిటీ 20 టీఎంసీలు కాగా.. వర్షాలు, వరదల వల్ల ఈ ఏడాది జులై 28 నాటికి 17.813 టీఎంసీలకు చేరింది. అంతకు ఒకరోజు ముందు నుంచి అంటే జులై 27 నుంచే నంది పంప్ హౌస్ ద్వారా లిఫ్టింగ్ ప్రారంభించారు. రోజుకు సగటున 10వేల క్యూసెక్కుల  చొప్పున నీటిని నందిమేడారం, గాయత్రీ పంప్ హౌస్ మీదుగా శ్రీ రాజరాజేశ్వర (మిడ్ మానేర్) ప్రాజెక్టుకు తరలిస్తున్నారు.

 ఈ క్రమంలో ఇప్పటివరకు 10.92 టీఎంసీల నీటిని మిడ్​మానేరులో ఎత్తిపోయడంతో మంగళవారం రాత్రి వరకు ప్రాజెక్టు నీటిమట్టం16.98 టీఎంసీ లకు చేరింది. దీంతో  రెండు రోజులుగా 6,400 క్యూసెక్కుల నీటిని మిడ్ మానేర్ నుంచి సిద్దిపేట జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అన్నపూర్ణ రిజర్వాయర్ కు, మంగళవారం నుంచి రంగనాయకసాగర్ రిజర్వాయర్​లోకి లిఫ్ట్ చేస్తున్నారు.

3.5 టీఎంసీల కెపాసిటీ గల అన్నపూర్ణ రిజర్వాయర్, 3టీఎంసీల సామర్థ్యమున్న రంగనాయక సాగర్ రిజర్వాయర్ నాలుగై‌‌‌‌‌‌‌‌దు రోజుల్లో నిండే అవకాశం ఉండడంతో ఆ తర్వాత మల్లన్న సాగర్(50టీఎంసీలు), అటు నుంచి కొండపోచమ్మ సాగర్​(15టీఎంసీలు)లకు ఎత్తిపోసేందుకు ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు.

పేరుకే కాళేశ్వరం.. ఎత్తిపోసింది ఎల్లంపల్లి నుంచే

ప్రాణహిత –- చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఎల్లంపల్లి రిజర్వాయర్ ను 20.175 టీఎంసీల కెపాసిటీతో డిజైన్ చేశారు. ఏటా వర్షాకాలంలో ప్రాణహిత నుంచి ఎల్లంపల్లి ద్వారా రోజుకు 2టీఎంసీల చొప్పున 160 టీఎంసీలు ఎత్తిపోసి 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని భావించారు. ఎన్టీపీసీకి 6 టీఎంసీలతో పాటు హైదరాబాద్ కు తాగునీరు, పరిశ్రమల అవసరాలకు నీటిని కేటాయించారు. 2004లో ఎల్లంపల్లి రిజర్వాయర్​కు అప్పటి సీఎం రాజశేఖర్​రెడ్డి శంకుస్థాపన చేశారు. 

రాష్ట్ర విభజనకు ముందే ఈ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయినప్పటికీ అప్పటి సీమాంధ్ర సీఎంతో  ప్రారంభోత్సవం చేయించేందుకు తెలంగాణ కాంగ్రెస్​ నేతలు ఒప్పుకోకపోవడంతో వాయిదా పడింది.  తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రారంభించిన ఈ రిజర్వాయర్ నాటి నుంచి నేటివరకు​గోదావరి ఎత్తిపోతలకు పెద్దదిక్కుగా మారింది. హైదరాబాద్​తాగునీరు, ఎన్టీపీసీ అవసరాలను తీర్చడంతో పాటు ఎస్సారెస్పీ ఆయకట్టు స్థిరీకరణకు ఉపయోగపడుతున్నది. 

అయితే రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రాణహిత– చేవెళ్లను పక్కనపెట్టిన బీఆర్ఎస్ సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టింది. 2019 జూన్​లో అప్పటి సీఎం కేసీఆర్​కాళేశ్వరం బ్యారేజీలను ప్రారంభించారు. అంతకుముందు మూడేండ్లపాటు మిడ్​మానేరు, ఎల్​ఎండీ రిజర్వాయర్లను నింపేందుకు ఎల్లంపల్లి ఎత్తిపోతలే దిక్కయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించుకున్నాక ఏనాడూ పూర్తిస్థాయిలో ఎత్తిపోసింది లేదు. 

కాళేశ్వరం ద్వారా ఏటా 240 టీఎంసీలు ఎత్తిపోయాల్సి ఉండగా, గడిచిన ఐదేండ్లలో కేవలం 200 టీఎంసీలను మాత్రమే లిఫ్ట్ చేశారు. కింద మేడిగడ్డ నుంచి ఎగువన ఎల్లంపల్లిలోకి ఎత్తిపోసినప్పుడల్లా  పైన భారీ వర్షాలు, వరదలు వచ్చి ఎత్తిపోసిన నీళ్లలో 100 టీఎంసీలకు పైగా తిరిగి గోదావరిలోకి వదిలిపెట్టారు. మిగిలిన 50 టీఎంసీలను రిజర్వాయర్లలో నిల్వచేయగా, కేవలం 50టీఎంసీలు మాత్రమే సాగుకు మళ్లించారు.

 అవి కూడా ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసినందున అవి కాళేశ్వరం నీళ్లా? ఎల్లంపల్లి నీళ్లా? అనే స్పష్టత లేకుండాపోయింది. ఇక గతేడాది అక్టోబర్​లో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు బుంగలు పడడడంతో ఎన్​డీఎస్ఏ ఆదేశాల మేరకు కాళేశ్వరం రిజర్వాయర్ల గేట్లన్నీ ఖుల్లా పెట్టడంతో ఈసారి పూర్తిగా ఎల్లంపల్లి నీళ్లే దిక్కయ్యాయి. 

వాస్తవానికి ఏటా వర్షాకాలంలో గోదావరికి వరదలు వచ్చినప్పుడు ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసుకోగా, మరో 50 నుంచి 60 టీఎంసీలను దిగువకు వదులుతున్నారు. 2022–--23లో నైతే భారీ వరదలు వచ్చినప్పుడు ఏకంగా 80 టీఎంసీలు కిందికి వదిలేయడం గమనార్హం. అంటే కాళేశ్వరం ఉన్నా లేకున్నా ఎల్లంపల్లి నుంచి ఏటా 50 నుంచి 60 టీఎంసీల నీటిని ఎగువకు ఎత్తిపోయవచ్చనేది ఈ ఐదేండ్లలో రుజువైందని ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు.

సిద్దిపేట రైతుల్లో హర్షం..

 సిద్దిపేట జిల్లాలో నీళ్లు లేక బోసిపోయిన రిజర్వాయర్లు ఎల్లంపల్లి ఎత్తిపోతలతో జలకళ సంతరించుకుంటున్నాయి. కాళేశ్వరం మూతపడ డంతో ఇక జిల్లాలోని రిజర్వాయర్ల లోకి నీటి పంపింగ్ జరగదని బీఆర్ఎస్​ నేతలు ప్రచారం చేశారు. కానీ, ఎల్లంపల్లి నీళ్లు వస్తుండడంతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్టులను 70టీఎంసీల కెపాసిటీతో నిర్మించారు.

 వర్షాభావ పరిస్థితుల వల్ల  ఈ రిజర్వాయర్లన్నీ అడుగంటే స్థితికి చేరాయి. ప్రస్తుత పంపింగ్ కు ముందు అనంతగిరి రిజర్వాయర్ లో 0.75 టీఎంసీలు, రంగనాయక సాగర్ లో 0.67 టీఎంసీలు, మల్లన్న సాగర్ లో 8.5 టీఎంసీలు, కొండ పోచమ్మ సాగర్ లో 4.5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. 2 రోజుల క్రితం శ్రీపాద ఎల్లంపల్లి నుంచి  మిడ్ మానేర్ మీదుగా జిల్లాలోని రిజర్వాయర్లకు నీరు చేరడం ప్రారంభమైంది. త్వరలో రంగనాయక సాగర్ లోకి 2 పంపులతో నీటిని ఎత్తి పోస్తామని ఇరిగేషన్ ఆఫీసర్లు చెబుతున్నారు. రిజర్వాయర్లలోకి నీరు చేరగానే కాల్వల ద్వారా నీటిని మళ్లించే అవకాశం ఉండడంతో రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తున్నది.