నేతన్నకు ఆ‘దారం’

  • వేములవాడలో యార్న్‌‌‌‌ డిపో ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు

  • టెస్కో ఆధ్వర్యంలో క్రెడిట్‌‌‌‌పై యార్న్‌‌‌‌ ఇచ్చి, వస్త్రాన్ని సైతం కొనుగోలు చేయనున్న ప్రభుత్వం

  • వేలాది మంది కార్మికులకు ప్రయోజనం

  • నేరవేరిన సిరిసిల్ల కార్మికుల 30 ఏండ్ల కల

రాజన్న సిరిసిల్ల, వెలుగు : సిరిసిల్ల నేతన్నలు ముప్పై ఏండ్లుగా ఎదురుచూస్తున్న యార్న్‌‌‌‌ డిపో ఏర్పాటు కల ఎట్టకేలకు నెరవేరింది. కార్మికులకు ఏడాది పొడవునా పని కల్పించాలన్న ఉద్దేశంతో యార్న్‌‌‌‌ డిపో ఏర్పాటుకు కాంగ్రెస్‌‌‌‌ సర్కార్‌‌‌‌ గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌ ఇచ్చింది. డిపో ఏర్పాటు తర్వాత కార్మికులకు టెస్కో ఆధ్వర్యంలో క్రెడిట్‌‌‌‌పై యార్న్‌‌‌‌ ఇవ్వడంతో పాటు ఉత్పత్తి అయిన వస్త్రాన్ని సైతం టెస్కోనే కొనుగోలు చేయనుంది. దీంతో ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కార్మికులకు మేలు కలగనుంది. 

వేములవాడలో ఏర్పాటుకు కసరత్తు

టెంపుల్‌‌‌‌ సిటీ అయిన వేములవాడలో యార్న్‌‌‌‌ డిపో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిపో ఏర్పాటు కోసం రూ. 50 కోట్లు సైతం కేటాయించింది. దీంతో వేములవాడలోని అగ్రికల్చర్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో డిపో ఏర్పాటు కోసం టెస్కో ఆఫీసర్లు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 

పట్టించుకోని గత ప్రభుత్వం

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో సుమారు లక్ష మంది పద్మశాలీలు ఉన్నారు. ఇందులో దాదాపు 50 వేల మంది వస్త్ర పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇందులో 30 వేల మంది మరమగ్గాలపై కార్మికులుగా పని చేస్తున్నారు. జిల్లాలో యార్న్‌‌‌‌ డిపో ఏర్పాటు చేయాలని గత ముప్పై ఏండ్లుగా నేత కార్మికులు ప్రభుత్వాలను డిమాండ్‌‌‌‌ చేస్తూనే ఉన్నారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అధికారంలో ఉన్న పదేండ్లు యార్న్‌‌‌‌ డిపో ఏర్పాటు చేస్తామంటూ హామీలు ఇచ్చిందే తప్ప దానిని నెరవేర్చలేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌‌‌‌ యార్న్‌‌‌‌ డిపో ఏర్పాటుకు జీవో జారీ చేయడం వేలాది మంది కార్మికులకు ఉచితంగా యార్న్‌‌‌‌ లభించడంతో పాటు చేతి నిండా పని దొరకనుంది. దీంతో నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

టెస్కో ఆధర్యంలో క్రెడిట్‌‌‌‌పై యార్న్‌‌‌‌

వేములవాడలో ఏర్పాటు చేయనున్న యార్న్‌‌‌‌ డిపో నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం టెస్కోకు అప్పగించింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో గుజరాత్‌‌‌‌ నుంచి యార్న్‌‌‌‌ దిగుమతి చేసుకొని క్రెడిట్‌‌‌‌పై సిరిసిల్ల నేతకార్మికులకు అందించనున్నారు. వస్త్రానికి సరిపడా యార్న్‌‌‌‌ ఇచ్చి, క్లాత్‌‌‌‌ ఉత్పత్తి అయ్యాక దానిని కూడా టెస్కోనే కొనుగోలు చేయనుంది.ఆ టైంలో యార్న్‌‌‌‌ బిల్లు కట్‌‌‌‌ చేసి మిగతా డబ్బులను, సబ్సిడీని కార్మికులకు అందించనుంది.

యార్న్‌‌‌‌ సబ్సిడీ డైరెక్ట్‌‌‌‌గా నేతన్నలకే...

సిరిసిల్ల జిల్లాలో యార్న్‌‌‌‌ డిపో ఏర్పాటుతో వేలాది మంది నేతన్నలకు మేలు కలగనుంది. ఇన్నాళ్లు ఓ పది మంది బడా సేట్లు మాత్రమే ఇతర రాష్ట్రాల నుంచి యార్న్‌‌‌‌ దిగుమతి చేసుకుని కార్మికులకు ఇస్తుండేవారు. కార్మికులు ఆ సేట్లు పెట్టిన షరతుల మేరకు క్లాత్‌‌‌‌ ఉత్పత్తి చేసి తిరిగి వారికే ఇచ్చేవారు. ఆ టైంలో యార్న్‌‌‌‌ బిల్లు కట్‌‌‌‌ చేసుకొని మిగిలిన డబ్బులను కార్మికులకు ఇచ్చేవారు. దీంతో యార్న్‌‌‌‌పై వచ్చిన సబ్సిడీని బడా సేట్లే మిత్తీల పేరిట కాజేసేవారు. ఇప్పుడు ప్రభుత్వమే యార్న్‌‌‌‌ డిపో ఏర్పాటు చేస్తుండడంతో సబ్సిడీ కార్మికులకే దక్కనుంది. రూ. 100 విలువైన క్లాత్‌‌‌‌ ఉత్పత్తి చేస్తే సబ్సిడీ కింద రూ. 9 డైరెక్ట్‌‌‌‌గా కార్మికుడికే అందనుంది.

యార్న్‌‌‌‌ కొనే బాధ తప్పుతుంది 

పెద్ద పెద్ద సేట్ల వద్ద యార్న్‌‌‌‌ కొని బట్ట ఉత్పత్తి చేసేటోళ్లం. యార్న్‌‌‌‌ డిపో ఏర్పాటు చేసి ప్రభుత్వమే యార్న్‌‌‌‌ ఇచ్చి, బట్టను కొనుగోలు చేస్తే నేతన్నల ఇబ్బందులు తొలగిపోతాయి. జిల్లాలో డిపో పెట్టాలని చాలా ఏండ్ల నుంచి అడుగుతున్నాం. డిపో ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చి మాట తప్పింది. యార్న్‌‌‌‌ డిపో ఏర్పాటుకు కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం ముందుకు రావడం సంతోషంగా ఉంది.
- ఆడెపు భాస్కర్‌‌‌‌, పాలిస్టర్‌‌‌‌ వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షుడు

నేతన్నలను అన్ని రకాలుగా ఆదుకుంటాం 

సిరిసిల్ల నేతన్నలను అన్ని రకాలుగా ఆదుకుంటాం. సిరిసిల్లలో యార్న్‌‌‌‌ డిపో ఏర్పాటుతో పాటు 1.30 కోట్ల చీరల ఆర్డర్లను సిరిసిల్ల నేతన్నలకు ఇస్తాం. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి రెండు చీరలు చొప్పున అందించే ఆర్డర్‌‌‌‌ను సిరిసిల్ల కార్మికులకే అప్పగిస్తాం. నేతన్నలను అన్ని రకాలుగా ఆదుకునేందుకు సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి సానుకూలంగా ఉన్నారు. నేతన్నలకు ఏడాదంతా పని కల్పిస్తాం. 

ఆది శ్రీనివాస్‌‌‌‌, ప్రభుత్వ విప్