- ధర్మదర్శనానికి మూడు, స్పెషల్ దర్శనానికి గంట సమయం ఆదివారం ఒక్కరోజే
- రూ.63.17 లక్షల ఆదాయం
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. హైదరాబాద్ సహా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో కొండ కింద లక్ష్మీపుష్కరిణి, వ్రత మండపాలు, కల్యాణకట్ట, అన్నదాన సత్రం, పార్కింగ్ ప్లేస్, కొండపైన బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్, ప్రధానాలయ ప్రాంగణం సందడిగా కనిపించాయి. భక్తుల రద్దీ కారణంగా స్వామివారి దర్శనానికి గంటల తరబడి క్యూలో వెయిట్ చేయాల్సి వచ్చిందని భక్తులు తెలిపారు. స్వామివారి ధర్మదర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు.
నారసింహుడి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆదివారం భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్యకైంకర్యాల ద్వారా ఆలయానికి రూ.63,17,011 ఆదాయం వచ్చింది. అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.19,31,440, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.6.50 లక్షలు, వీఐపీ దర్శనాల ద్వారా రూ.9,17,700, బ్రేక్ దర్శనాలతో రూ.4,52,700 ఇన్‌కం వచ్చినట్లు ఆఫీసర్లు వెల్లడించారు.
అయ్యప్ప మాలధారుల కోసం 11న ప్రత్యేక ‘గిరిప్రదక్షిణ’
అయ్యప్ప మాలధారణ తీసుకున్న వారి కోసం ఈ నెల 11న ప్రత్యేక ‘గిరిప్రదక్షిణ’ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఈవో భాస్కర్‌రావు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 11న ఉదయం 6 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద గిరి ప్రదక్షిణ ప్రారంభం అవుతుందన్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం ఉదయం 7 నుంచి 8.45 గంటల వరకు ప్రత్యేక దర్శన సదుపాయం కల్పించి, మాలధారులకు ఉచితంగా స్వామివారి ప్రసాదాన్ని అందించనున్నామని పేర్కొన్నారు.