కిక్కిరిసిన యాదగిరిగుట్ట ధర్మదర్శనానికి 2 గంటలు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. శ్రావణమాసానికి తోడు ఆదివారం కావడంతో హైదరాబాద్‌‌‌‌తో సహా వివిధ జిల్లాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, బస్‌‌‌‌ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడాయి. 

రద్దీ కారణంగా స్వామివారి ధర్మదర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి అరగంటకు పైగా సమయం పట్టిందని భక్తులు తెలిపారు. మరో వైపు ఆలయంలో నిర్వహించిన సుదర్శన నారసింహ హోమం, స్వామివారి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. కొండ కింద సత్యనారాయణస్వామి వ్రత మండపంలో భక్తులు సతీసమేతంగా వ్రతాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. 

ఆలయానికి రూ. 48.47 లక్షల ఆదాయం

యాదగిరిగుట్టలో ఆదివారం భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆలయానికి రూ.48,47,250 ఆదాయం వచ్చింది. అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.17,33,700, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.6 లక్షలు, ప్రధాన బుకింగ్‌‌‌‌ ద్వారా రూ.6,00,450, సత్యనారాయణస్వామి వ్రతాల ద్వారా రూ.3,25,600, యాదరుషి నిలయం ద్వారా రూ.3,00,352, వీఐపీ దర్శనాలతో రూ.4,62,150, బ్రేక్‌‌‌‌ దర్శనాల ద్వారా రూ.2,85,300 ఇన్‌‌‌‌కం వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు. ఆదివారం 3,100 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించాలని ఆఫీసర్లు వెల్లడించారు.